మధ్యాహ్న భోజనం తిని విద్యార్థుల అస్వస్థత

Feb 15,2024 20:23

ప్రజాశక్తి – కురుపాం: స్థానిక ఆదర్శ పాఠశాల వద్ద మధ్యాహ్న భోజనం తిని ఇద్దరు విద్యార్థులు అస్వస్థత గురై, వాంతులు, కళ్లు తిరిగి పడిపోయే సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో గురువారం మధ్యాహ్న భోజన సమయంలో ఆదర్శ పాఠశాల వద్దకు వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎంఇఒలకు ఫోన్‌ చేసి ఆదర్శ పాఠశాలలో భోజనం బాగోలేక విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారని తెలిపారు. వెంటనే ఎంఇఒలు ఎన్‌.సత్యనారాయణ, రాధాకృష్ణ పాఠశాలను సందర్శించి, భోజనాలను పరిశీలించి ఎండిఎం నిర్వాహకులు, ఆదర్శ పాఠశాల సిబ్బందితో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో సిబ్బంది గానీ నిర్వాహకులు గానీ రాజీ లేకుండా సక్రమంగా వండి అందించాలని సూచించారు. అనంతరం నిల్వ ఉన్న స్టాకును పరిశీలించగా కుళ్లిన గుడ్లు, కాలం ముగిసిన చోడిపిండి ప్యాకెట్లు నిల్వ ఉండడం వారి పరిశీలనలో బయట పడింది. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ భోజనం నాణ్యత లేకపోవడం వాస్తవమేనని, గురువారం నుంచి 15 రోజుల పాటు ప్రత్యేకంగా సిఆర్పిలు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లతో టీం వేసి ప్రతిరోజు పిల్లలకు ఎండిఎం వడ్డించే సమయంలో ఈ టీము రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించేలా చూస్తామని తెలిపారు. అప్పటికీ సక్రమంగా వండక పోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఆర్పిలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

➡️