వివాదాస్పదంగా వైసిపి కార్యాలయం

Jun 24,2024 21:39

 అనుమతులు లేకుండా నిర్మాణం

 పనులు నిలపివేయాలంటూ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నోటీస్‌

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి / టౌన్‌  : నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయం వివాదా స్పదంగా మారింది. అనుమతులు లేకుండా చేపట్టిన భవన నిర్మాణ పనులను తక్షణమే ఆపేయాలంటూ విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం సోమవారం నోటీసు జారీచేసింది. దీంతో, ఈ వివాదం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొన్ని జిల్లాల్లో నిర్మాణ అనుమతులు తీసుకోకుండా, మరికొన్ని చోట్ల ప్రభుత్వ భూముల్లోనూ వైసిపి కార్యాలయ భవన నిర్మాణాలు చేపట్టినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం ఏకంగా కూల్చివేసింది. ఈనేపథ్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని జమ్మునారాయణపురం రెవెన్యూ పరిధిలో రింగురోడ్డుకు ఆనుకుని చేపట్టిన కార్యాలయ నిర్మాణ పనులకు విఎంఆర్‌డిఎ నుంచి అనుమతులు పొందలేదని మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తేల్చారు. అలాగే అగ్నిమాపక శాఖ నుంచి కూడా అనుమతులు పొందలేదని కూడా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వైసిపి జిల్లా అధ్యక్షునికి నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు కార్యాలయ భవన స్థలం కూడా మాన్సాస్‌కు చెందినదని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అధికారులపై ఒత్తిడి చేసి నిర్మాణాలు చేపట్టారంటూ టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. వైసిపి నాయకులు మాత్రం భవన నిర్మాణాల విషయంలో అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయని, ప్రభుత్వం ఉద్ధేశ పూర్వకంగా తమ పార్టీని బదనం చేయడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు. డిగ్రీ కళాశాలకు ఉపయోగించాలిఈ వ్యవహారం చర్చనీయాశం కావడంతో ఈ భవన నిర్మాణాన్ని కూల్చేకన్నా ప్రభుత్వం డిగ్రీ కళాశాలకు ఉపయోగిస్తే బాగుటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినప్పటికీ సొంత భవనం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ సాంస్కృత కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. వసతులు సరిపోకపోవడంతో అక్కడ విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర అసవస్థలు పడుతున్నారు. ఇక లైబ్రరీ, ప్రయోగశాలలు కూడా లేకపోవడంతో విద్యాబోధనలో నాణ్యతా ప్రమాణాలు తగ్గుతున్నాయి.

➡️