మైనింగ్‌ దోపిడీ

Jun 24,2024 21:41

కార్పొరేట్లకు పట్టని ప్రభుత్వ నిబంధనలు

స్థానికుల ఉపాధికి భారీ గండి

ప్రభుత్వాలు మారినా పట్టించు కోని అధికారులు

ప్రజాశక్తి – జామి :  జిల్లాలోని మైనింగ్‌ క్వారీలను ప్రజా ప్రాజెక్ట్‌ల పేరుతో కొంతమంది బడా వ్యాపారులు కొల్లగొడుతున్నారు. కాసుల కక్కుర్తిలో అధికారులు కూడా ప్రభుత్వ పాలసీలను పక్కదోవ పట్టించి, కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని దోపిడీ చేస్తున్న కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారు. గత ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగిన మైనింగ్‌ లూటీ, కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతూనే ఉంది. జామి మండల కేంద్రంలో క్వారీల పని తీరును పరిశీలిస్తే కార్పొరేట్ల మైనింగ్‌ మాఫియా ఎలా ఉందో అర్ధమవుతోంది. జిల్లాలో 200కు పైగా రోడ్డు మెటల్‌ క్వారీలు, వంద వరకూ గ్రావెల్‌ క్వారీలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా క్వారీలు రెన్యువల్‌ జరగక, పూర్తి స్థాయి ప్రభుత్వ అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. ప్రధానంగా పర్యావరణ క్లియరెన్స్‌ (ఇసి)లు లేక క్వారీలు, వాటిపై ఆధారపడిన స్టోన్‌ క్రషర్లు మూతబడ్డాయి. దీంతో వీటిపై ఆధార పడిన వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్‌ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. కానీ కోట్ల రూపాయల కాంట్రాక్టు దక్కించుకున్న కార్పొరేట్లకు మాత్రం గత ప్రభుత్వంలో కారు చౌకగా దక్కాయి. సామాన్యుడు కొనలేని స్థితిలోకి మెటల్‌ ధరలు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో సొంతింటి కల మసకబారుతోంది. జామి మండలంలో క్వారీలు ఒకటి, రెండు మినహా దాదాపుగా అన్ని క్వారీలు ఇసి (ఎన్విరాల్‌ మెంట్‌ క్లియరెన్స్‌)లు లేక నిలిచిపోయాయి. దీంతో క్వారీల్లో పనులు చేయడానికి అవకాశం లేక, లీజు దారులు క్వారీలు నిలిపేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం రాయల్టీని ప్రైవేటుకు అప్పగించడంతో క్వారీ మైనింగ్‌ కుదరని పని. ఈ నేపథ్యంలో దాదాపుగా క్వారీలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పలు ప్రాజెక్టులు దక్కించుకున్న కార్పొరేట్లు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రాత్రి, పగలు అన్న తేడా లేకుండా మైనింగ్‌ చేస్తున్నాఉ. జామి, కొత్తవలస, గంట్యాడ మండలాల్లో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి కాంట్రాక్టర్‌ జామి, ఆలుగుబిల్లి క్వారీలను అడ్డగోలుగా దక్కించుకున్నాయి. ఇప్పటికే లక్షల టన్నులు మైనింగ్‌ చేస్తున్నారు. క్వారీలకు ఇసిలు, పర్మిట్‌లు అవసరం లేకుండా అధికార యంత్రాంగానికి కొంత ముట్టజెప్పి అడ్డగోలుగా క్వారీల్లో మైనింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడితో ఆగకుండా తమ ప్రాజెక్టులకు కావాల్సిన మెటీరియల్‌ను మైనింగ్‌ చేసుకుని మిగిలిన క్వారీలను మరో ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు అప్పగించి వ్యాపారం చేసుకుం టున్నారు. ఒక్క జామి, ఆలుగుబిల్లి క్వారీలు మాత్రమే కాదు. జిల్లాలోని అన్ని క్వారీలు ప్రస్తుతం కార్పొరేట్ల చేతుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఓల్టా చట్టాలను అతిక్రమించి, నాల్గు, ఐదు వందల అడుగులకు పైగా మైనింగ్‌ చేయడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో 5 కిలో మీటర్ల పైన భూగర్బ జలాలు అడుగంటిపోతున్నాయి. ఉపాధి అవకాశాలకు గండి జిల్లాలో క్వారీలపై సుమారుగా 10 వేల మంది వరకు కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు. నేడు పెద్దపెద్ద మిషనరీ రావడంతో ఆ సంఖ్య సగానికిపైగా పడిపోయింది. అయితే కార్పొరేట్లు ఒడిశా, జార్ఖండ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించుకొని స్థానికుల ఉపాధికి ఎసరు పెడుతున్నారు. పైగా పదేళ్ల పాటు కార్మికులు పని చేయాల్సిన క్వారీలను అడ్డగోలుగా తవ్వి, గ్రామాలకు గ్రామాలు వలసలు పోయే ప్రాంతాలుగా మార్చేస్తున్నారు.

➡️