మన్యం బంద్‌కు మద్దతుగా సిపిఎం దీక్ష

Mar 8,2024 20:35

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : ఆదివాసీల హక్కుల రక్షణకు ఈనెల 10న ఏజెన్సీ బంద్‌కు మద్దతుగా సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట ఆదివాసీ జన రక్షణ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షను ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ గిరిజనులకు నష్టం చేసే విధానాలను కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. అందులో భాగంగానే ఎన్నో ఏళ్లు పోరాడి సాధించిన హక్కులను కాలరాస్తూ గిరిజనులకు ద్రోహం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్‌సి గిరిజన నిరుద్యోగులకు ఉపయోగం లేదన్నారు. అందుకనే గిరిజన నిరుద్యోగుల స్పెషల్‌ డిఎస్సీ విడుదల చేయాలని, రద్దు చేసిన జిఒ 3పై ఆర్డినెన్స్‌ ఇవ్వాలని, అటవీ భూముల చట్ట సవరణ రద్దుచేసి 1/ 70 చట్టాన్ని పగడ్బందీగా అమలు చేjలని, పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 10న తలపెట్టిన మన్యం బందుకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ దీక్షలు జరుగుతున్నాయి అన్నారు. వన సంరక్షణ పేరుతో బిజెపి ప్రభుత్వం 1/70 చట్టానికి తూట్లు పొడుస్తుందని, ఐదో షెడ్యూల్లో ఉన్న గిరిజన సంపద గనులు, ఖనిజాలను, విలువైన భూములను కొల్లగొట్టి కార్పొరేట్లకు, పెట్టుబడి దారులకు నైవేద్యం పెడుతుందని విమర్శించారు. గతంలో టిడిపి, ఇప్పుడు వైసిపి బిజెపి అడుగులకు మడుగులోత్తుతూ గిరిజనుల హక్కులను, సంపదను దోపిడి దారులకు కట్టబెడుతున్నారని అన్నారు. కావున గిరిజన సమస్యలు పరిష్కారం చేయాలని జరుగుతున్న ఏజెన్సీ బంద్‌ను, నిరసన ప్రదర్శనలు ర్యాలీలు మద్దతుగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, కార్యదర్శివర్గసభ్యులు ఎం.తిరుపతిరావు, వై.మన్మధరావు, జిల్లా కమిటీ సభ్యులు జి.వెంకటరమణ, బంటు దాసు, నాయకులు జి.వెంకటరమణ, పి.రాజశేఖర్‌, సూరిబాబు, పి.రాము, ఇ.బలరాం, సింహాచలం, రాజు తదితరులు పాల్గొన్నారు.

సాలూరు: జిఒ 3కు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్సు తీసుకురావాలని కోరుకుంటూ ఈనెల 10న నిర్వహించనున్న మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు సీదరపు అప్పారావు, మండల కార్యదర్శి వంతల సుందరరావు కోరారు. శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మన్యం బంద్‌కు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఏకలవ్య పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం గిరిజనేతరులతో భర్తీ చేసిందన్నారు. ప్రభుత్వం డిఎస్సీ ప్రకటిస్తే వాటిలో గిరిజన సంక్షేమ శాఖకు 1025 పోస్టులు మాత్రమే కేటాయించినట్లు తెలిపారు. వీటిలో ఐటిడిఎ పాఠశాలల్లో 517 పోస్టులను నోటిఫై చేసినట్లు చెప్పారు. దీనిలో కేవలం ఆదివాసీలకు 38 పోస్టులు మాత్రమే కేటాయించినట్లు తెలిపారు. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఐదు శాతం ఉన్న గిరిజనేతరులకు 95 శాతం ఉద్యోగాలు, 95 శాతం ఉన్న గిరిజనులకు ఐదు శాతం ఉద్యోగాలు కేటాయించడం అన్యాయమన్నారు. ఆదివాసీ నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జీవో 3 రద్దు చేసి మూడేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పునరుద్ధరణకు కృషి చేయడం లేదని అన్నారు. ఆర్డినెన్స్‌ ద్వారా జీవో 3ను పునరుద్ధరణ చేయాలని కోరుతూ ఈనెల 10న నిర్వహించనున్న మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని వారు కోరారు. సమావేశంలో గిరిజన సంఘం నాయకులు తాడంగి గాసి పాల్గొన్నారు.

కొమరాడ : ఏజెన్సీ బంద్‌ను విజయవంతం చేయాలని గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు హెచ్‌ రామారావు పిలుపునిచ్చారు. బంద్‌కు మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్‌ డిఎస్‌సి విడుదల చేయాలని, జీవో 3పై ఆర్డినెన్స్‌ ఇవ్వాలని కోరారు. అటవీ భూముల చట్ట సవరణ రద్దు చేయాలని, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పదెకరాల వరకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీటితోపాటు అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించి విద్య, వైద్యం, నిత్యాసర వస్తువులు తెచ్చుకోవడానికి వీలుగా మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాంసంఘాల నాయకులు యు.వెంకటేష్‌, కె.సాంబమూర్తి, రెడ్డి శివున్నాయుడు, మాణిక్యం, కైలాస్‌, మధు పాల్గొన్నారు.

➡️