మహిళల జీవన పరిస్థితులు మార్చడమే లక్ష్యం

Jan 29,2024 20:15

  ప్రజాశక్తి-చీపురుపల్లి : రాష్ట్రంలోని మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మహిళలకు తమ కుటుంబాల్లో గౌరవం పెంచేందుకే ప్రతి పథకాన్ని మహిళల పేరుతో అందించేలా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. మండల స్థాయిలో వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగో విడత సంబరాల కార్యక్రమం స్థానిక కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయ మైదానంలో సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ ఎటువంటి అవినీతికి, రాజకీయ పక్షపాతానికి తావులేకుండా అందిస్తున్నామని పేర్కొన్నారు. చీపురుపల్లిలో త్వరలోనే వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నామని, ఈ ఆసుపత్రి ఏర్పాటుతో ఈ ప్రాంత వాసులు వైద్య అవసరం కోసం విజయనగరం వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. రాజకీయం అంటే మోసం చేయడం కాదని, ప్రజలకు సేవ చేయడమని టిడిపి నాయకులను ఉద్దేశించి అన్నారు. గ్రామాల్లోకి టిడిపి నాయకులు వస్తే నిలదీయాలన్నారు. సభలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి మాట్లాడారు. ఈ సందర్భంగా చీపురుపల్లి మండలంలోని 14,727 మంది స్వయంశక్తి సంఘాల మహిళలకు రూ.11.54 కోట్ల వై.ఎస్‌.ఆర్‌.ఆసరా మొత్తాలకు సంబంధించిన చెక్కును మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు.అంతకు ముందు కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 20.80 లక్షలతో నిర్మాణం చేసిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను మంత్రి ప్రారంభించారు. రూ.23,94 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. చీపురుపల్లి మేజర్‌ పంచాయతీకి చెందిన 41 మంది ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలను కూడా మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి రఘురాజు, డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి, ఆర్‌డిఒ బి.శాంతి, జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీష, ఎంపిపి ఇప్పిలి వెంకటనరసమ్మ, వైసిపి నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, బొత్స సందీప్‌ నాయుడు, వైసిపి జిల్లా యువ నాయకులు బెల్లాన వంశీకృష్ణ, వైస్‌ ఎంపిపిలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అన్ని శాఖల అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

➡️