మహేంద్ర మృతికి కారకులను అరెస్టు చెయ్యాలి

బొంతా మహేంద్ర

ప్రజాశక్తి-రాజమహేంద్రవరందొమ్మేరు దళిత యువకుడు బొంతా మహేంద్ర ఆత్మహత్యకు కారకులైన వైసిపి నాయకులు ముదునూరి నాగరాజు, బి.సతీష్‌, ఎస్‌ఐ భూషణంను వెంటనే అరెస్ట్‌ చెయ్యాలని కెవిపిఎస్‌ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు డిమాండ్‌ చేశారు. దొమ్మేరులో ఫ్లెక్సీ వివాదంలో మహేంద్రను పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితులను అరెస్ట్‌ చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడుతూ సంఘటన జరిగి 9 రోజులు కావస్తున్నా హోమ్‌ మంత్రి ఇలాకాలో నిందితులను ఎందుకు అరెస్ట్‌ చెయ్యలేదని రాంబాబు ప్రశ్నించారు. నిందితులను వారంలోగా అరెస్ట్‌ చెయ్యకపోతే దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో దళిత గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు. దళిత గిరిజనులకు సిపిఎం అండగా ఉంటుందని అన్నారు. రిపబ్లికన్‌ పార్టీ నాయకులు నక్కా వెంకటరత్నం మాట్లాడుతూ జిల్లాలో దళితులపై దాడులు చేసిన వారు చేయించేవారు చేసేవారు వైసిపిలోని అగ్రకులనాయకులే ఎక్కువ అని దళితులపై అఘాయిత్యాలు చేసిన వారికి జగన్‌ మోహన్‌ రెడ్డి పదోన్నతులు కల్పిస్తున్నారని విమర్శించారు. ప్రగతిశీల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కె.మస్తాన్‌ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని అమలు చెయ్యకుండా ప్రభుత్వమే నీరుగారుస్తూ ఆధిపత్య కులాలకు అండగా ఉంలోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు కోరుకొండ చిరంజీవి, టిడిపి ఎస్‌సి సెల్‌ నాయకులు బొర్రా చిన్న, టిడిపి ఎస్‌సి సెల్‌ నాయకురాలు, ఖండవల్లి లక్ష్మి, దళిత నాయకులు దారా యేసురత్నం, దుర్గారావు, సుబ్బారావు, కెఎన్‌పిఎస్‌ నాయకులు కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వి.రాంబాబు, దువ్వాడ రాజా పాల్గొన్నారు.

➡️