మాకెందుకీ టెన్షన్‌!

Mar 24,2024 20:05

ప్రజాశక్తి-చీపురుపల్లి : ‘మాకెందుకీ టెన్షన్‌? అభ్యర్థిని ప్రకటించి పుణ్యం కట్టుకోండి!.. ఎదుటి పార్టీవారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థిని ప్రకటించక పోవడంతో మాకు బిపి లెవెల్స్‌ పెరిగి పోతున్నాయి. త్వరగా అభ్యర్థిని ప్రకటించి పుణ్యం కట్టుకోండి’ అంటూ తమ నాయకుల వద్ద టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై పది రోజులు గడుస్తున్నా అభ్యర్థి ఎవరో తెలియక తాము ప్రజలకు సమాధానం చెప్పలేక పోతున్నామని వాపోతున్నారు. ఒకవైపు ఎదుటి పార్టీ వారు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఇప్పటికే రెండు మూడు దఫాలుగా తమ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తుంటే, టిడిపి అభ్యర్థి ఎవరంటూ ప్రజలు తమను అడుగుతున్నారని మండలంలో ఒక నాయకుడి వద్ద టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంతకీ టిడిపి అభ్యర్థిని ప్రకటిస్తారా? లేదా అనే సందేహం కూడా తమలో కలుగుతుందనే భావన కూడా కార్యకర్తలు సదరు నాయకుడి వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అంతే కాకుండా టిడిపి అభ్యర్థిని వెంటనే ప్రకటించకపోతే తమదారి తాము చూసుకుంటామంటూ కార్యకర్తలు సదరు నాయకుడితో తెగేసి చెప్పినట్లు సమాచారం. టిడిపి అధినాయకత్వం చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థిని ఎప్పటికి ప్రకటిస్తుందో వేచి చూడాల్సిందే.

➡️