మాటిచ్చి మడమతిప్పిన సిఎం

Dec 15,2023 21:06

భోగాపురం : అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని గత ఎన్నికల్లో మాటిచ్చి ముఖ్యమంత్రి మడమతిప్పారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ అన్నారు. భోగాపురంలో చేపడుతున్న అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బంది ద్వారా బలవంతంగా తాళాలు విరగ్గొట్టి తెరవడం దారుణమని అన్నారు. గత ముఖ్యమంత్రులు అంగన్వాడీలతో పెట్టుకొని ఇంట్లో కూర్చున్న విషయం మర్చిపోవద్దని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించి అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి బి.సూర్యనారాయణ, యూనియన్‌ నాయకులు కృష్ణవేణి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. తహశీల్దార్‌ బంగార్రాజుకు వినతిపత్రం అందజేశారు. యూనియన్‌ నాయకులు కొర్లమ్మ, శ్రీదేవి, సెక్టార్‌ లీడర్లు పి.అనిత, పి.చిన్నమ్మలు, పి.సుజాత, కె.ప్రవీణ పాల్గొన్నారు.

➡️