మాదిగలను వంచించిన సీఎం జగన్‌

ప్రజాశక్తి-కనిగిరి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాక ముందు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడటమే కాకుండా వర్గీకరణ అనేది తండ్రి వైస్సార్‌ చివరి కోరిక అని ఆరోజు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక వర్గీకరణ గురించి మాట్లాడకుండా మాదిగ జాతిని వంచించడం ఒక్క జగన్మోహన్‌రెడ్డికే దక్కిందని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్స్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎమ్మార్పీఎస్‌ సంఘీభావం తెలియజేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. జగన్‌ పైకి ఒకలాగా కనిపిస్తూ లోపల దళితులను అణగదొక్కడమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉగ్ర నరసింహారెడ్డి కంకణం కట్టుకుని సేవ చేస్తున్నాడన్నారు. కనిగిరి నియోజకవర్గంలో మాదిగల తలరాత మారాలంటే ఉగ్ర నరసింహారెడ్డి గెలవాలని, మాదిగలు అందరూ ఐకమత్యంతో ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని అన్నారు. ఉగ్రనరసింహారెడ్డి గెలుపు మాదిగలకు మలువు అంటూ ఎమ్మార్పీఎస్‌ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు జలదంకి నరసింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదిమూలపు ప్రకాశం మాదిగ, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు నేలపాటి రాజు, ఎంఎస్‌పి జిల్లా అధ్యక్షుడు తొరేటి ఆనంద్‌ మాదిగ, నియోజకవర్గ అధ్యక్షుడు రావినూతల కోటయ్య మాదిగ, బీజేపీ నాయకులు శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

➡️