మానవతకు ప్రతిరూపం వివేకా

ప్రజాశక్తి – కడప ప్రతినిధి మాజీ మంత్రి వైఎస్‌ వివేకా మానవతకు ప్రతిరూపమని పిసిసి ఛీప్‌ వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. శుక్రవారం కడప నగర శివారులోని జయరాజ గార్డెన్స్‌లో నిర్వహించిన వివేకా ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్‌ వివేకా స్మారకార్థం…జ్ఞాపకార్థ సమావేశానికి పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్‌ వివేకా మంచి మనిషి, అద్భుతమైన వ్యక్తిత్వం, అందరికీ సహాయపడే గుణం కలిగిన వారని కొనియాడారు. ఇటువంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన నాయకుని క్రూరాతికూరంగా హత్య చేయడాన్ని మరిచిపోలేక పోతున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ తమ్ముడికి ఐదేళ్లుగా న్యాయం జరగని నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మొదట గుండెపోటుతో చని పోయాడని ప్రచారం చేశారని, సాక్షి టివిలో కూడా ఇదే విషయాన్ని కవరేజ్‌ చేసిందని, ఇక్కడకు వచ్చాకే హత్య గురించి తెలిసిందని, ఎవరు చేశారో అప్పుడు తెలియదని, ఆనీ ఇప్పుడు తెలుస్తున్నాయని, బంధువులే హత్య చేశారని అందరికీ తెలుసునన్నారు. చిన్నాన్న హత్య కేసులో వైఎస్‌ సౌభాగ్యమ్మ, సునీత ఎక్కువ నష్టపోయారన్నారు. చెల్లెలికి న్యాయం చేయాల్సింది పోయి చివరికి సునీత హత్య చేసిందని చెప్తున్నారన్నారు. సోషల్‌ మీడియాలో బెదిరింపులు, బూతులు, తోడబుట్టిన చెల్లెళ్లను అవమానాలను తట్టుకుని నిలబడిందని తెలిపారు. న్యాయం కోసం సునీత తిరగని చోటు, తట్టని వాకిలి, తొక్కని గడప లేదని చెప్పారు. సునీత కుటుంబం హత్య చేసి ఉంటే ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు. సునీత న్యాయ, ధర్మ పోరాటానికి ఆయుధాన్నై భాగస్వామిని అవుతానని ప్రకటించారు. చిన్నాన్న ఆత్మకు శాంతి చేకూరే వరకు పోరాటం ఆగదని చెప్పారు. హత్యా రాజకీయాలను ఛీకొట్టా లని, అంతిమంగా నిజం గెలిచేలా ప్రజలు ఓటు ద్వారా స్పందించా లని విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ మీ చిన్నాన్నను చంపిన, చంపించిన వారిని గుర్తించాలి, అది ముఖ్యమంత్రిగా మీబాధ్యత. అది నేనైనా, నాకుటుంబ మైనా తేల్చాలి. నేను చంపినట్లు ఆధారం ఉంటే సిబిఐకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హంతకులను గుర్తించిన వారికి ఐదు లక్షల రివార్డు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అంతకుముందు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, పులివెందుల టిడిపి అభ్యర్థి బి.టెక్‌ రవి, మాజీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, నజీర్‌అహ్మద్‌ తదితరులు ప్రసంగంలో వివేకా కుమార్తె సునీత న్యాయ పోరాటానికి అండగా ఉంటాయని చెప్పారు. వర్థంతి కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్‌ వివేకాకు ఘన నివాళి పులివెందుల టౌన్‌ : మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి 5వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులర్పించారు. శుక్రవారం పట్టణంలోని వివేకా సమాధి వద్ద కుమార్తె వై.ఎస్‌. సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, బామ్మర్ది శివ ప్రకాష్‌ర్‌డ్డి , జగన్‌ బాబారు వై.ఎస్‌? సుధీకర్‌ రెడ్డి , అభిమానులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వివేక పార్క్‌లోని వివేకానంద రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసే నివాళులర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి కడప జయరాజ్‌ గార్డెన్‌ లో ఏర్పాటు చేసిన స్మారకోత్సవ, జ్ఞాపకార్థ సమావేశానికి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో వైఎస్‌ వివేక కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

➡️