మానవ హక్కుల పరిరక్షణతోనే మానవ వికాసం

ప్రజాశక్తి- బొబ్బిలి:  మానవ హక్కుల పరిరక్షణతోనే మానవ వికాసం చైతన్యం అవుతుందని బొబ్బిలి రోటరీ క్లబ్‌ అధ్యక్షులు జెసి రాజు అన్నారు. ఆదివారం స్థానిక త్రిబుల్‌ ఎస్‌ డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంఘం విజయనగరం జిల్లా చైర్మన్‌ భవిరెడ్డి శంకరరావు ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా పాల్గొన్న జెసి రాజు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం ఈ సంవత్సరాన్ని ఐక్య రాజ్యసమితి అందరికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందేలా ప్రపంచ దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చిందన్నారు. ప్రస్తుతం మానవ హక్కులపై దాడిజరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని పరిరక్షించుకోవటం కోసం, కోల్పోతున్న హక్కులను పునరుద్ధరణ కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. మానవ హక్కులకు పోలీస్‌ స్టేషన్‌లోనే అత్యధిక ముప్పు ఏర్పడుతుందన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి. రమణ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా చైల్డ్‌ రైట్స్‌ ఫోరమ్‌ చైర్మన్‌ పి. చిట్టిబాబు మాట్లాడుతూ గౌరవ ప్రథమైన జీవనానికి మానవ హక్కులు అవసరమని అన్నారు. జీవించే హక్కు, కుటుంబాన్ని కలిగి ఉండే హక్కు, న్యాయాన్ని పొందే హక్కు, ప్రైవసీని కలిగి ఉండే హక్కు, స్వేచ్ఛ హక్కు, పని హక్కు, విద్యా హక్కు మొదలైన మానవ హక్కులని, ఇవి ఎలాంటి బేధాలు లేకుండా అందరికీ వర్తిస్తాయని అన్నారు. పౌరుల గౌరవ ప్రధమైన జీవనానికి, స్వేచ్ఛకు, సమానత్వానికి, వారి హక్కులను రక్షించటం ప్రభుత్వాల కర్తవ్యమని అన్నారు. తర తమ భేదాలు లేకుండా ప్రజలందరి హక్కులను కాపాడటం రాజ్యాంగ బద్ధమైన విధిగా ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ మానవ హక్కులపై అవగాహన కలిగి ప్రశాంత మైన జీవనాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్యూడిషియల్‌ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధి సూర్య చంద్రరావు, మానవ హక్కుల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రామాంజనేయ మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️