ముంచిన మిచౌంగ్‌

Dec 6,2023 00:05
తుపాన్‌తో కళ్లాలపై

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, యంత్రాంగం

మిచౌంగ్‌ తుపాన్‌ సృష్టించిన కల్లోళంతో జిల్లా ప్రజలు వణికిపోయారు. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల వద్ద తీరం దాటిన ప్రభావంతో వీచిన ఈదురుగాలులతో తీరం ప్రాంతం హడలెత్తిపోయింది. తీరప్రాంతంతోపాటు, ఇతర మైదాన ప్రాంతాల్లోనూ విధ్వంసాన్ని సృష్టించింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగిపోయాయి. పలు గ్రామాల్లో పూరిల్లు, పెంకిటిల్లుల పైకప్పులు గాలిలో ఎగిరిపడ్డాయి. పంట చేతికొచ్చే సమయంలో ముంచుకొచ్చిన తుపాన్‌ ప్రభావంతో వేల ఎకరాల్లో వరి పంట నీటి పాల్జేసింది. పనలపై ఉన్న పంటతోపాటు, రాసులుగా పోసి భద్రపర్చుకున్న ధాన్యం సైతం నీటి పాలు అయ్యింది. జిల్లాలో 2.6 లక్షల ఎకరాల్లో వరి సాగగా, 1.32 లక్షల ఎకరాల్లో కోతలు కోసి పంటను ఒబ్బిడి చేసుకున్నారు. సుమారు 74 వేల ఎకరాల్లో పంటను కోసేందుకు రైతులు సిద్ధమయ్యారు. యు.కొత్తపల్లి, పిఠాపురం, కరప, కాజులూరు, తాళ్లరేవు, సామర్లకోట, పెద్దాపురం తదితర మండలాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈదుర గాలులకు సుమారు 8 వేల ఎకరాల్లో వరి పంట నెలకొరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 1500 ఎకరాల్లో పనల మీద ఉన్న పంట నీటిలో మినిగిపోయింది. 90-100 కి.మీ వేగంతో ఈదురుగాలులుమిచౌంగ్‌ తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో యు. కొత్తపల్లి, తాళ్లరేవు, కాకినాడ రూరల్‌ తదితర తీరప్రాంత గ్రామాల ప్రజలు భయం భయంగా గడిపారు. యు.కొత్తపల్లి మండలం కొండెవరం శివారు ఇంద్రానగర్లో భారీ ఈదుర గాలులకు 40 ఇళ్లకు పైకప్పులు ధ్వంసం అయ్యాయి. దీంతో వారు నిరాశ్రయులయ్యారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కల్గడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కాకినాడ రూరల్‌ వలసపాకల, వాకలపూడి రోడ్డులో ట్రాన్సఫార్మర్‌ వద్ద కరెంటు వైర్లు తెగి పడి ఒక గేదె మృతి చెందింది. జగ్గంపేట రూరల్‌ తుపాన్‌ ప్రభావం మండలంలో విస్తారంగా వర్షం కురిసింది. వర్షం కారణంగా రైతులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మండలంలో సాగుచేసిన యంత్రాల ద్వారా కోతలు కోయడంతో తేమ శాతం అధికంగా ఉండటంతో ధాన్యంను రోడ్లపై ఆరబోసుకున్నారు. అయితే ఇప్పటి వరక 447 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు తరలించామని, ఇంకా కళ్లాల్లో 200 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉందని ఎఒ శ్రీరామ్‌ వెల్లడించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో ఆ ధాన్యంను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మండలంలో పలు ముంపు ప్రాంతాల్లో ఆర్‌డిఒ సీతారామారావు పర్యటిం చారు. యు.కొత్తపల్లి తుపాన్‌ ప్రభావంతో ఉప్పాడ, కోనపాపపేట, సూరంపేట, మయపట్నం, మూలపేట గ్రామాలు రాకాసి అలలు తాకడంతో పలు గృహాలు సముద్ర కోతకు గురయ్యాయి. ఈదురు గాలులతో పలు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 10 పెంకుటిల్లులు ధ్వంసం అయ్యాయి. తుపాన్‌ ప్రభావంతో అల్లకొల్లాలంగా ఉన్న తీర ప్రాంతాన్ని ఎంఎల్‌ఎ పెండెం దొరబాబు మంగళవారం పర్యటించారు. అలాగే ఉప్పాడ సముద్ర తీరాన్ని ఎస్‌పి సతీష్‌ కుమార్‌ పరిశీలించారు. అలాగే మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పలువురు బాధిత కుటుంబాలను కలుసుకుని ఓదార్చారు. గండేపల్లి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. అలగే వేరుశనగ, మినప పంట సాగు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రౌతులపూడి ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. మండల తహశీల్ధార్‌, మండల వ్యవసాయ శాఖ అధికారి ఈశ్వరరావు పలుప్రాంతాల్లో పర్యటించారు. గండేపల్లి మండలంలోని మల్లేపల్లి గ్రామంలో సుడిగుండం విలయతాండవం సృష్టించింది. జాతీయ రహదారిలో ఉన్న పెట్రోల్‌ బంకు చుట్టుపక్కల పొలాల్లో సుడిగాలి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ సుడిగాలికి 3 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు విరిగి నేలకొరిగాయి. సామర్లకోట రూరల్‌ మండల పరిధిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సామర్లకోట జగనన్న కాలనీలో డ్రయిన్ల సదుపాయం పూర్తిస్థాయిలో లేకపోవడంతోకాలనీ అంతా జలమయమైంది. పట్టణ పరిధిలో జగనన్న కాలనీ, భాస్కర్‌ నగర్‌ కాలనీ, సాయి నగర్‌, తెనుకుల పుంత, ఆర్‌టిసి బస్టాండ్‌, ప్రెసిడెంట్‌ గారి వీధి, వెలమ వీధి తదితర ప్రాంతాలు భారీ వర్షాలకు జలమయ్యాయి. అలాగే పట్టణంలోని 31వ వార్డు భాస్కర్‌ కాలనీలో వార్డు కౌన్సిలర్‌ పాగా సురేష్‌ కుమార్‌ ముంపు బాధిత కుటుంబాలకు వారం రోజులకు సరిపడా కూరగాయలు, కిరాణా సరుకులు, పాలును ఎస్‌కె బార్సు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కిర్లంపూడి మండలంలో పలు గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. పంట పొలాల్లో మోకాలి లోతులో నీళ్ళు చేరాయి. ప్రస్తుతం వెయ్యి ఎకరాల్లోని పంట కళ్లాల్లోనే ఉంది. కోత కోయాల్సిన పంటతోపాటు, కళ్లాల్లో ఉన్న ధాన్యం రాసులు నీట మునిగాయి. జగ్గంపేట రూరల్‌ మండలంలో ఈదురు గాలులతోపాటు కుండ పోత వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా కురిసిన వర్షం 40.4 శాతం నమోదు అయిందని తహశీల్దార్‌ శ్రీదేవి తెలిపారు. ఈ గాలులతో కూడిన వర్షం వల్ల పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే జగ్గంపేట మెయిన్‌ రోడ్‌ నిర్మానుష్యంగా మారింది. వ్యాపారస్తులు, ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. తాళ్లరేవు మండలంలోని పలు ప్రాంతాల్లో రైతాంగం జాగ్రత్త చేసిన ధాన్యం రాశులను ఎఎంసి ఛైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ మండల స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే మండలంలో నెలకున్న పరిస్థితులపై ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌కుమార్‌ సమీక్షించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్ట పరిహారంపై నివేదికను తయారు చేయాలని అన్నారు. కూలిన తాటాకు ఇళ్లకు నష్ట పరిహారాన్ని 48 గంటల్లోగా ఇవ్వాలని ఆదేశించారు. కరప తుపాన్‌ ప్రభావంతో మండలంలో విస్తారంగా వర్షం పడింది. ఈదురుగాలులకు వరి పొలాలు నేలనం టాయి. రాశులుగా పోసి బరకాలతో భద్రపర్చిన ధాన్యం సైతం నీటి పాలైయింది. పంట పొలాల్లో కోతలు కోసిన పనలు నీట మునగడంతో రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే మాజీ జడ్‌పిటిసి నులుకుర్తి వెంకటేశ్వరరావు మండలం లోని వలసపాకల, వాకాడ, పెదకొత్తూరు, కరప గ్రామాల్లో పర్యటించారు. తక్షణమే నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పెద్దాపురం మండల పరిధిలోని వరి పండించే సుమారు 16 గ్రామాల ఏటి పట్టు రైతులు 50 శాతం పైగా వరి కోతలు పూర్తి చేశారు. ఇంకా చాలా వరి పొలాల్లో కోతలు పూర్తయి పనల మీద ఉన్నాయి. 20 శాతం వరకు నూర్చిన ధాన్యం కళ్లాలపై ఉంది. కొంతవరకు కుప్పలు వేసి ఉంది. తుపాన్‌తో కళ్లాలపై ఉన్న ధాన్యాన్ని గుట్టలు వేసి తార్పాలిన్లు వేసి కాపాడుకున్నారు.

➡️