ముంచుతున్న నకిలీ

Mar 15,2024 22:49

తనిఖీల్లో పట్టుబడ్డ నకిలీ బయో ఉత్పత్తులు (ఫైల్‌)
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం పరగటిచర్ల మండలంలోని పొలాల్లోకి ఒక కారు వచ్చి ఆగింది.. అందులో నుండి టక్కు చేసుకుని టిప్‌టాప్‌గా రెడీ అయిన ఒకరు దిగి సమీపంలోని రైతులను పిలిచాడు. ఏం పంట ఎంత వేస్తున్నారు.. అని గౌరవంగా అడిగి ఆకట్టుకున్నాడు. సాగులో ఇబ్బందులు కొన్ని మాట్లాడి తమ కంపెనీ మందులు వాడటం ద్వారా అధిక దిగుబడి వస్తుందని, మిర్చిలో తెగుళ్లు పురుగులు ఆశించవని నమ్మించారు. దీంతో మందపాటి వెంకటేశ్వర్లు అనే కౌలురైతు రూ.4 లక్షల మందులు కొనుగోలు చేశారు. ఆ మందులు వేసిన తర్వాత మిర్చి తోట లోపించింది. రూ.6.50 ఎకరాలకు పెట్టిన రూ.15 లక్షల పెట్టుబడి మట్టిపాలైంది. తనకు జరిగిన అన్యాంపై బాధితుడు పోలీస్‌స్టేషన్‌, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడంతోపాటు ‘జగనన్నకు చెబుదాం’లోనూ ఫిర్యాదు చేసినా న్యాయం దక్కక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.వ్యవసాయం కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి.. భార్య తాళిసహా ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులన్నింటినీ అమ్మి పెట్టుబడి సమకూర్చుకునే రైతులను నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు నిండా ముంచుతున్నాయి. చంటి బిడ్డలా సాకును సాకుతున్నా ఆశిస్తున్న తెగుళ్లు, పురుగుల నుండి పైరును కాపాడుకోవడానికి రైతులు పడే యాతన అంతాఇంత కాదు.. దీన్నే వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ నకిలీలను అంటగడుతున్నారు. వ్యవసాయ శాఖాధికారుల సహకారంతోనే అక్రమార్కులు రెచ్చిపోతూ రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. అయితే కొంతమంది రైతులు మాత్రం తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు, ప్రజాప్రతినిధులను విన్నవించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

పల్నాడు జిల్లా మొత్తంగా బయో పురుగు మందుల వ్యాపారం రూ.70 కోట్ల వరకూ ఉంటుందని అంచనా కాగా ఇందులో 90 శాతం మందులు నకిలీవని సమాచారం. ఒక్క నరసరావుపేటలోనే 20కుపైగా బయో పురుగు మందుల దుకాణాలున్నాయి. వీటిల్లో సీజన్‌కు రూ.30 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా కాగా ఇందులో 90 శాతానికి పైగా నకిలీ మందులే విక్రయిస్తారని తెలిసింది. ఈ ఉత్పత్తులు పేరుతో చలామణీ అయ్యే కంపెనీల్లో 100 ఉంటే అందులో నాలుగైదు కంపెనీలకు మించి అనుమతులు ఉండవు. అయినా ఆ మందులనే రైతులకు అంటగట్టి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. విత్తన దుకాణాలు నరసరావుపేట పట్టణంలో 20 వరకూ ఉన్నాయి. వీటిల్లో సీజన్‌కు రూ.40 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా కాగా ఇందులో 20 శాతం 8 కోట్ల వరకూ నకిలీ విత్తన వ్యాపారమే ఉంటుంది.
బయో కెమికల్‌ పేరుతో అనుమతి లేని నకిలీ ముందులను వ్యాపారులు చాటు మాటుగా అమ్ముతూ రైతులను నట్టేట ముంచుతున్నారు. పల్నాడు జిల్లాను నకిలీ బయో ఉత్పత్తులు ముంచెత్తాయి. తెలంగాణ రాష్ట్రం నుండి వస్తున్న ఈ ఉత్పత్తులు వివిధ రకాల కంపెనీల పేరుతో జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. లైసెన్సు లేని వ్యాపారులు, రైతులతో సంబంధాలున్న కొందర్ని ఎంపిక చేసుకుని లాభాల ఆశ చూపి వారి ద్వారా ఆయా మందులను రైతులకు అంటగడుతున్నారు. అమ్మకాలను బట్టి కమీషన్లతో పాటు బంగారం, వెండి నాణేలు ఇస్తూ అక్రమ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. ఈ ఎరువుల ద్వారా తెగుళ్లు, పురుగు నివారణతోపాటు పైరుకు ఇతర పోషకాలు నేరుగా అందుతాయిని, పూత, దిగుబడి అధికంగా వస్తుందని నమ్మబలుకుతున్నారు. చిన్న మందు డబ్బా తయారీకి రూ.20 వరకు అవుతుండగా దాన్ని రూ.ఐదారు వందులకు అమ్మి అక్రమంగా అర్జిస్తున్నారు. రైతులను మోసం చేయడానికి ఉత్పత్తిదారులు తొలుత డీలర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ ఉత్పత్తులను ఎక్కువగా అమ్మిన వారికి అధిక కమీషన్లు, బంగారు నాణేలు ఇస్తామని ఆశ చూపుతున్నారు. వీటికి ఆశపడిన డీలర్లు.. తమకు రైతులతో ఉన్న పరిచయాలను ఉపయోగించి వారితో బయో ఉత్పత్తులను కొనిపిస్తున్నారు. అయితే రైతులకిచ్చే బిల్లులను అసలైనవి కాకుండా కోటేషన్‌ రూపంలో ఇస్తున్నారు. తీరా రైతు మోసపోయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాడు. విత్తనాల విషయంలో రైతులను మరో తరహాలో మోసం చేస్తున్నారు. డీలరే ఒక కంపెనీ విత్తనాలను రైతుల ద్వారా సాగు చేయించి ఆ పంట నుండి వచ్చిన విత్తనాలను ప్రాసెస్‌ చేయించి మళ్లీ అమ్ముకుంటున్నారు. ఇలా ఎకరాకు ఐదు కిలోలు ఇచ్చి వాటి నుండి వచ్చే 50-70 కిలోలను రూ.లక్షల్లో అమ్ముతున్నారు. కొన్ని కంపెనీలైతే ఒక సీజన్‌లో అమ్ముడవని విత్తనాలను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసి వాటిని మరుసటి సీజన్‌లో కొత్త విత్తనాలతో కలిసి అమ్ముతున్నారు. అయితే వీరిపై పూర్తిస్థాయిలో నిఘా, కఠిన చర్యలు కరువయ్యాయి.
నకిలీ విత్తనాలతో నష్టపోయా
చెన్నంశెట్టి సాంబశివరావు, కౌలు రైతు, కట్టుబడివారిపాలెం, చిలకలూరిపేట మండలం.
1.60 ఎకరాల్లోని మిరప తోటకు కౌలు,పెట్టుబడి మొత్తం రూ.2 లక్షల వరకు ఖర్చయింది. నకిలీ మిరప విత్తనాలతో తోట ఎదుగుదల లోపించింది. శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించి నకిలీ విత్తనాలుగా గుర్తించారు. విత్తన దుకాణ యజమాని కానీ విత్తన కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు.

➡️