మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రారంభం

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

మున్సిపల్‌ కార్మికులకు ఎన్నికల సమయంలో సిఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ మంగళవారం సమ్మె ప్రారంభించారు. మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్‌ కార్మికులు తమ విధులు బహిష్కరించి ఈ సమ్మెలో పాల్గొన్నారు. వివిధ సర్కిల్స్‌ నుండి మున్సిపల్‌ ఆఫీసు వద్దకు చేరుకుని శిబిరం ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి కలెక్టరేట్‌ వరకూ పనిముట్లతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ కర్రవంతెన, పవర్‌పేట రైల్వే స్టేషన్‌ రోడ్డు, ఆర్‌ఆర్‌ పేట మెయిన్‌ రోడ్డు, ప్రభుత్వాసుపత్రి, ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌, జిల్లా పరిషత్‌ గెస్ట్‌ హౌస్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకూ సాగింది. కార్మికులు చీపుర్లు, పారలతో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ సిఎం జగన్‌ మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని ఆయన తెలిపారు. ప్రధానంగా మున్సిపల్‌ కార్మికులను ఆరు నెలల్లో పర్మినెంట్‌ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. నాలుగున్నర సంవత్సరాలు వేచి చూసి గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్త సమ్మె చేపట్టినట్లు తెలిపారు. ఆరు మాసాలుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నప్పటికీ మంత్రులు, అధికారులు ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌, హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, క్లాప్‌ ఆటోల డ్రైవర్లకు కనీస వేతనాలివ్వాలని పెద్ద ఎత్తున నినదించారు. మున్సిపల్‌ కార్మికులకు సిఐటియు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.జగన్నాధరావు, వి.సాయిబాబు, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.గోపి తమ సంఘీభావం తెలిపారు. సమ్మెకు యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌బాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లావేటి కృష్ణారావు, బంగారు వెంకటేశ్వరరావు, నాగరాజు, జార్జి, బండి రాజు, గోపి, నారాయణ, ఏసురత్నం, కాళిదాసు, దావీదు, మరియన్న, వినుకొండ రమేష్‌, కె.సాంబశివరావు, కానూరు సత్యనారాయణ, శ్రీనివాసరావు, సోమేశ్వరరావు, రాజు, మహిళా కార్మిక నాయకులు మేతర పాప, బండి భవాని, తేగల సత్యవతి, నక్క భాగ్యలక్ష్మి , జోస్ఫిన్‌, దుర్గ, రమణమ్మ, శివకొండ, రంగమ్మ, అనిత, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు. నూజివీడు: సిఎం జగన్‌ మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి జి.రాజు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనమివ్వాలని, మున్సిపల్‌ కార్మికులకు నష్టం కలిగించే ఆప్కాస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు హనుమాన్లు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూని యన్‌ నాయకులు జయలక్ష్మి, రాణి, పద్మ, గౌరి, రజని, పంగిడిమ్మ, గోవింద్‌, ఏడుకొండలు, గాంధీ, జయరాం, సాయి, చంద్రశేఖర్‌, చిన్నారి, గంగాధర్‌రావు పాల్గొన్నారు. చింతలపూడి : మున్సిపల్‌ కార్మికులకు ఎన్నికల ముందు సిఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌విఎస్‌.నారాయణ డిమాండ్‌ చేశారు. స్థానిక నగరపంచాయతీ వద్ద మున్సిపల్‌ కార్మికులసమ్మెకు సిఐటియు తరపున పూర్తి మద్దతు తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమల కుమారి, నాగరాజు, విజయరావు, పద్మ పాల్గొన్నారు.

➡️