మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సమ్మె

Dec 26,2023 21:25

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, కోశాధికారి జి.వెంకటరమణ, సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణుతో కలిసి మున్సిపల్‌ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు తమ విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ముందు పాదయాత్రలోనూ, అసెంబ్లీ లోను మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, పర్మినెంట్‌ సిబ్బందికి సిపిఎస్‌ను వారం రోజుల్లోనే రద్దు చేస్తామని, హామీలు ఇచ్చారని అయితే ఆయన అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. మున్సిపల్‌ శాఖ మంత్రులకు, మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి, సిడిఎం ఎ.కోటేశ్వరరావుకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చామని, నాలుగున్నరేళ్లలో వీరంతా పలుమార్లు కార్మిక సంఘాల నాయకులతో విడిగాను, అన్ని సంఘాలతో ఉమ్మడిగానూ చర్చలు జరిపినా ప్రయోజనం లేదని అన్నారు. కావున కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టి తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకుంటామన్నారు. తక్షణమే మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ,గ్రాడ్యుటి, పెన్షన్‌ ఇవ్వాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు రూ.18,500 కనీస వేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ ఆప్కాస్‌ ఉద్యోగులు, కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ గ్రాడ్యుటీ సగం జీతం పెన్షన్‌ గా ఇవ్వాలని, పర్మినెంట్‌ సిబ్బందికి సిపిఎస్‌ రద్దు చేయాలని, విలీన పంచాయతీల్లో కరోనాకు, వరదలకు కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కాస్‌ జీతాలు, హెల్త్‌ అలవెన్స్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ నాయకులు నాగవంశం శంకర్రావు, చీపురుపల్లి సింహాచలం, మామిడి శివ, నాగవంశం మల్లేష్‌, బంగారు రవి, నాగవంశం నిర్మల, మంగళగిరి శ్రీను, మామిడి మజ్జి, పడాల ఆనంద్‌, సంతోష్‌, ఇప్పలమ్మ, ఎల్లమ్మ, గంగయ్యలు, పలువురు మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు. తొలుత మున్సిపల్‌ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా నాలుగు రోడ్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు.పాలకొండ : మున్సిపల్‌ కాంటాక్ట్‌ కార్మికులను, ఆప్కాస్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో సమ్మె చేపట్టారు. ఈ సమ్మె శిబిరాన్ని ప్రారంభించిన సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు పి.భాస్కరరావు, సిహెచ్‌ సంజీవి మాట్లాడుతూ పాదయాత్ర అసెంబ్లీ సాక్షిగా జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పడాల వేణు, చింతల సురేష్‌, విమల, శ్రీదేవి, వి.ఆంజనేయులు, బి.విశ్వరావు, సాయి, మధు తదితరులు పాల్గొన్నారు.మోకాళ్ల పై నిలబడి కార్మికుల నిరసనసాలూరు: మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు ప్రారంభించిన సమ్మె సందర్భంగా నిరసన శిబిరం వద్ద కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మున్సిపల్‌ కార్మికులు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాదయాత్రలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులు, అధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్ళినట్లు చెప్పారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ పట్టణ నాయకులు టి.శంకరరావు, పోలరాజు, రాముడు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ టి.ఇందూ ఆధ్వర్యాన చేపట్టిన సమ్మెలో పారిశుధ్య కార్మికులంతా పాల్గొన్నారు.

➡️