మెరుగుపడుతున్న వసతి గృహ విద్యార్థుల ఆర్యోగం

ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శిస్తున్న మంత్రి వేణు

ప్రజాశక్తి-అమలాపురం

అమలాపురం స్థానిక మండల పరిధిలో సమనస జ్యోతిరావు పూలే బిసి సంక్షేమ గురుకుల వసతి గృహంలో మంగళవారం కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 12 మంది 5,6 తరగతులకు చెందిన విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతోందని మంతి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. బుధవారం ఆయన స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న 12 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరా మర్శించి వైద్యులతో విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. జరిగిన సంఘటనపై డిఎస్‌పి ఎం.అంబికా ప్రసాద్‌, ఆర్‌డిఒ జి.కేశవర్ధన రెడ్డి ద్వారా విచారించాల్సిందిగా ఆదేశించా మన్నారు. అదే విధంగా బయట నుండి ఎగ్‌, పప్పు వంటి తాజాగా లేని తినుబండారాలను వసతి గృహంలో అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటి అమ్మకాలు పై కూడా దృష్టిసారించి నివేదికల సమర్పిం చాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామనిఆయన స్పష్టం చేశారు బయట నుండి తెచ్చిన బిర్యాని తినడం వల్ల ఆహారం కలుషితమై అస్వస్థతకు గురయ్యారా అన్న కోణంలో కూడా దర్యాప్తును నిర్వహించాలని ఆదేశించామన్నారు. భవిష్యత్తు లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వంటశాలలో సిసి కెమెరాలు అమర్చి తాజాగా మెనూ ప్రకారం ఆహార పదార్థాలు వండి వడ్డిస్తున్నది లేనిది గమనించాలని సూచించారు. గురుకుల వసతి గృహంలో 380 మంది విద్యార్థులు ఆశ్రయం పొంది విద్యను అభ్యసించుచున్నారని, తొలుత మంగళవారం ఆరుగురు విద్యార్థులు మాత్రమే అస్వస్థతకు లోను కాగా మరో ఆరుగురు మంగళవారం రాత్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరడం జరిగిందన్నారు. బిసి గురుకులాల్లో తాజాగా వండిన పదార్థాలని మెనూ ప్రకారం విద్యార్థులకు అందించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వసతి గృహాన్ని సందర్శించి వంట శాలను పరిశీలించి ఆహార పదార్థాలు తాజాగా వండి తయారు చేస్తుంది లేనిది ఆహార పదార్థాలను రుచి చూసి పరిశీలించారు. అనంతరం స్టోర్‌ రూమ్‌ ని ఆయన పరిశీలించారు. అరటి పళ్లు తాజాగా లేకపోవడం గమనించి వెంటనే వీటిని మార్చాలని ఆదేశించారు. వారానికి సరిపడ మాత్రమే కూరగాయలు కొనుగోలు చేసి వినియోగించాలని ఆదేశించారు. వసతి గహ మరుగుదొడ్లు బాత్రూమ్‌ల నిర్వహణ తీరును పరిశీలించారు. మనబడి నాడు నేడు రెండో దశలో వసతులను మరింత మెరుగు పరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ శ్రీ పల్లవి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ దంగేటి డోలమణి రుద్ర, ఆసుపత్రి సూప రింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️