రక్తహీనత వల్లే ఎక్కువ మాతృమరణాలు

Feb 8,2024 00:17

సమీక్షలో వైద్యులు, అధికారులను వివరాలు అడుగుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
మాతా శిశు మరణాల నివారణకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది, అధికారులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ స్పందన సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షకు కలెక్టర్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. మాతృ మరణాలు సంభవించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన చండ్రాజుపాలెం, నాదెండ్ల, యడ్లపాడు, దుర్గి నుండి సిబ్బంది, ప్రైవేట్‌, ప్రభుత్వ గైనకాలజిస్టులతో మాట్లాడి కారణాలు అడిగారు. అధిక శాతం మాతృ మరణాలు రక్తహీనత వల్ల సంభవిస్తున్నట్లు నిర్థారించారు. దీన్ని అధిగమించేందుకు, రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచేచేందుకు హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్లలో గర్భిణులతో హెల్త్‌ క్లబ్లను ఏర్పాటు చేయాలని, పోషకాహారం, యోగా, వ్యాయామం చేయించడంతోపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో వారికి అవగాహన కల్పించాలని సూచించారు. మాతృ మరణాలు సంభవించిన గర్భిణుల ఎంసిహెచ్‌ కార్డులను పరిశీలించారు. సమీక్షలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.రవి, డిఎఒ డాక్టర్‌ బి.గీతాంజలి, గైనకాలజిస్ట్‌ మంత్రు నాయక్‌, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ బివి.రంగారావు, వైద్యులు సిందూజ, ఎస్‌.వసంతరాయ, వెంకట్రావు, కెవి.లక్ష్మీకుమారి, శిరీష్‌, బుచ్చిబాబు, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉమారాణి పాల్గొన్నారు.

➡️