రాజరిక వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తుంది : రిటైర్డ్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారి పి.వి. రమేష్‌

మాట్లాడుతున్న విశ్రాంత అధికారి పివి రమేష్‌

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రస్తుత పాలకులు రాజరిక వ్యవస్థ ధోరణలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని రిటైర్డ్‌ ఐ. ఎ. ఎస్‌ అధికారి డాక్టర్‌ పి.వి రమేష్‌ పేర్కొన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలోని అనేక అంశాలు అమలుకు నోచుకోలేదన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో అర్థం కావడం లేదన్నారు. నేటి అధికార పార్టీ నేతలు దైవాంశ సంభూతులుగా భావిస్తూ రాజ్యాంగ ధర్మాన్ని పాటించడం లేదన్నారు. దేశంలో 50 శాతం అట్టడుగు ఉన్న ప్రజల చేతుల్లో కేవలం మూడు శాతం సంపద ఉంటే అగ్రభాగాన ఉన్న ఒక్క శాతం ప్రజల చేతుల్లో 50 శాతం సంపద కేంద్రీకతమవటం వలన ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని అదే నేటి ప్రధాన సమస్య అన్నారు. 2047 నాటికి పట్టణ జనాభా ఆంధ్రప్రదేశ్‌ లో 50 శాతానికి చేరుకుంటుందని అదే సమయంలో పట్టణంలో మురికి వాడలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. పాఠశాలకు రంగులు వేస్తే, బిల్డింగులు నిర్మిస్తే మాత్రమే విద్యారంగం అభివద్ధి కాదని ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల ను నియమించుకోవాలన్నారు. ఏడవ తరగతి విద్యార్థులు రెండవ తరగతి పాఠాలను చదవలేని స్థితిలో ఉన్నారన్నారు. విద్యావంతులైన నేటి యువతలో మూడవ వంతు నిరుద్యోగులుగా కొనసాగుతున్నారన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ చట్టాన్ని రూపొందించాలని ,అందరికీ ఆరోగ్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వాలు స్వీకరించాలన్నారు. కర్ణాటకలో మాదిరిగా ప్రతి గ్రామంలో ఆధునిక గ్రంథాలయాలు ఆంధ్రప్రదేశ్‌ లో ఏర్పాటు చేయాలన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుణాంద్రప్రదేశ్‌ గా రాష్ట్రం రూ. 10 లక్షల కోట్ల అప్పులతో రుణాంద్రప్రదేశ్‌ గా మారిందని రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి డాక్టర్‌ పి.వి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జనచైతన్య వేదిక హాలులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక స్థితిపై డాక్టర్‌ పి.వి రమేష్‌ తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. డాక్టర్‌ పి.వి రమేష్‌ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల ద్వారా 250 శాతం ఆదాయం పెరిగిందనీ పేదలు నిరుపేదలుగా మారారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో తలసరి అప్పు 2.5 లక్షలకు చేరిందని, అప్పు తీర్చడానికి తిరిగి అప్పు చేసే పరిస్థితులకు నెట్టివేయబడిందన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలను అభివద్ధి చేసుకోలేకపోయామని వ్యవసాయ రంగ అభివద్ధికి పెట్టుబడులను సక్రమంగా పెట్టలేకపోయామన్నారు. పని సంస్కతి తగ్గిపోతుందని, అధికార యంత్రాంగం అవినీతిపరులైన, రాజకీయ నేతల కబంధహస్తాలలో మ్రగ్గి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌. రంగయ్య , సర్వీస్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ సేవకుమార్‌ , వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ ప్రత్యూష సుబ్బారావు, జై ఆంధ్ర ఫోరం నేత అవధానుల హరి, మానవత చైర్మన్‌ పావులూరి రమేష్‌ , ప్రముఖ అధ్యాపకులు ప్రొఫెసర్‌ కె.మాల కొండయ్య , డాక్టర్‌ పి. పోతురాజు తదితరులు ప్రసంగించారు.

➡️