రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కు నివాళి : సిపిఎం

అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు : దేశాన్ని పరిపాలిస్తున్న మనువాదుల నుండి రాజ్యాంగాన్ని పరిరక్షించటమే అంబేద్కర్‌కు అర్పించే నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ 67వ వర్థంతి సందర్భంగా స్థానిక లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాశం రామారావు మాట్లాడుతూ అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగం లౌకికవాదం, సమైక్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు. అయితే ఆ రాజ్యాంగ విలువలను నేడు కేంద్రంలో పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం కాలరాస్తోందని, ఆ ప్రయత్నాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బిజెపి ఒకవైపు అంబేద్కర్‌ను గౌరవిస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా రిజర్వేషన్లను పరిమితం చేస్తోందని, ఉన్న రిజర్వేషన్లనూ రద్దు చేస్తోందని అన్నారు. బిజెపిని ఓడించటం ద్వారానే రాజ్యాంగాన్ని పరిక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.లక్ష్మణరావు, బి.ముత్యాలరావు, వై.కృష్ణకాంత్‌, ఎం.కిరణ్‌, జి.లూథర్‌పాల్‌, టి.జాన్‌బాబు, షేక్‌ ఖాసిం షహీద్‌, వి.నారాయణ, షేక్‌ సమీర్‌, సిహెచ్‌ భగత్‌సింగ్‌ పాల్గొన్నారు.

➡️