రూపాయికే రూ.12లక్షల ఆస్తి

Feb 20,2024 21:19

ప్రజాశక్తి – సాలూరు: రూ.12 లక్షల విలువైన ఆస్తిని ఒక్క రూపాయికే అప్పగించిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. పేదల కోసం నిర్మించిన టిడ్కో గృహ సముదాయంలో 980 ఇళ్లను లబ్దిదారులకు మంగళవారం అందజేశారు. తొలుత ఆయన టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌తో కలిసి సుమారు వంద కోట్లతో నిర్మించిన గృహ సముదాయాలను ప్రారంభించారు. గృహప్రవేశం చేసిన లబ్దిదారులకు ప్రభుత్వం పంపిన చీరలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సకల మౌలిక సదుపాయాలతో ఇళ్లు నిర్మించి అందజేసినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 14 ఎకరాల భూమిని సేకరించినట్లు చెప్పారు. రూ.7 కోట్ల 8లక్షలతో గుమడాం సమీపంలో ఉన్న వేగావతి నది నుంచి తాగునీటి సరఫరా కోసం ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. టిడిపి ప్రభుత్వం హయాంలో ఒక్కో లబ్దిదారుని రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద 500రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారు. లబ్దిదారులకు రూ.2.65లక్షల రుణం కూడా 20 సంవత్సరాల పాటు చెల్లించాల్సి వుంటుందని చెప్పారు. నెలకు రూ.3వేలు చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధనలు రూపొందించిందని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలపై ఆర్ధిక భారం పడకుండా కేవలం రూపాయికే రూ.12లక్షల ఆస్తిని అప్పగించాలని నిర్ణయించిందని చెప్పారు. త్వరలో ఈ ప్రాంతంలో సచివాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్‌ సరఫరా కోసం లబ్దిదారులు మీటర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ డిప్యూటీ సిఎం రాజన్నదొర ప్రత్యేక దృష్టి సారించి సిఎంపై ఒత్తిడి చేసి రూ.7కోట్లుతో తాగునీటి సరఫరా పథకాన్ని మంజూరు చేయించారని చెప్పారు. ఎన్నికలకు ముందు గానే పేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని తనపై రాజన్నదొర ఒత్తిడి పెంచారని చెప్పారు. నిర్ధేశించిన గడువులోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి టిడ్కో అధికారులు సహకరించారని తెలిపారు. కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్‌ లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జర్జాపు ఈశ్వరరావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, పప్పల లక్ష్మణరావు, గొర్లి వెంకటరమణ, బి.శ్రీనివాసరావు, పి.మధుసూధనరావు, జి.నాగేశ్వరరావు, టిడ్కో ఇఇ జ్యోతి, మున్సిపల్‌ కమిషనర్‌ పి.ప్రసన్నవాణి, టిడ్కో డైరెక్టర్లు ఈశ్వరమ్మ, గోవింద రావు పాల్గొన్నారు.

➡️