రూ.10 వేల పైన వస్తువులకు బిల్లులుండాల్సిందే

Mar 22,2024 23:41

సమావేశంలో మాట్లాడుతున్న వి.సుబ్బారావు
ప్రజాశక్తి-ఈపూరు :
ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన చర్యలన్నీ తీసుకుం టున్నట్లు వినుకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, పులిచింతల స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వి.సుబ్బారావు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, సిబ్బందికి శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 85 ఏళ్లు పైబడిన వారు, 40 శాతం అంగవైకల్యం ఉన్నవారు, కోవిడ్‌ బారిన పడి ఆరోగ్యం క్షీణించిన వారి వద్ద నుండి ధ్రువపత్రాల ఆధారంగా ఫారం-12 దరఖాస్తు ద్వారా వారి అనుమతితో సార్వత్రిక ఎన్నికలకు ఐదు రోజులు ముందే ఓటు వేయించటం జరుగుతుందన్నారు. అవసరమైన వారి కోసం ప్రభుత్వ హనాలను ఏర్పాటు చేస్తామన్నారు. రూ.10 వేలు పైన కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి కచ్చితంగా బిల్లులు ఉండాలని, రూ.50 వేలు పైన నగదు రవాణా చేసేవారు ఆధారాలు చూపించాలని చెప్పారు. రూ.10 లక్షలకు పైన నగదు రవాణా చేస్తే సీజ్‌ చేస్తామని, వాటిని మళ్లీ పొందాలంటే ఆధారాలతో జిల్లా స్థాయిలో గ్రీవెన్స్‌లో అప్పీలు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ మండల అధికారిగా ఎంపీడీవో ఏవీ రంగనా యకులు ఉంటారని, ఎన్నికల పర్యవేక్షణకు సెక్టోరి యల్‌ అధికారులుగా మండలస్థాయి అధికారుల ఐదుగురిని నియ మించామని తెలిపారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో సర్వేలెన్స్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలు పనిలో ఉంటాయన్నారు. మండలంలోని 46 పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఏప్రిల్‌ 15వ తేదీ వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ప్రచారం కోసం రిటర్నింగ్‌ అధికారి అనుమతి తప్పనిసరి అన్నారు. సమావేశంలో తహశీల్దార్‌ బి.దిలీప్‌ కుమార్‌, డిప్యూటీ తహసిల్దార్‌ ఆర్‌.వెంకటేశ్వర్లు నాయక్‌, ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ ఫిరోజ్‌ పాల్గొన్నారు.

➡️