రెండు నెలలు ఆలస్యంగా

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లా సమీక్ష సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో జరగనుంది. సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షత వహిస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సి ఉన్నా గత జులై తరువాత మళ్లీ ఐదు నెలలకు గురువారం నిర్వహించనున్నారు. సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్‌, నీటి పారుదల, గృహ నిర్మాణం, జగనన్న కాలనీల్లో ప్రగతి, జాతీయ ఉపాధి హామీ చట్టం, కార్మిక బడ్జెట్‌, విద్య, వైద్యం, జగనన్న భూ హక్కు తదితర అంశాలపై చర్చించనున్నారు. వివిధ అంశాలపై చర్చల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు సమస్యలను ప్రస్తావించనున్నారు. వర్షాభావం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం, వరి, పత్తి, మిర్చి రైతుల ఇబ్బందులపై సభ్యులు ప్రస్తావించే అవకాశం ఉంది. రాబోయే వేసవిలో ఎదురుకానున్న తాగునీటి ఇబ్బందులు, సాగర్‌ జలాశయం నుంచి నీటి విడుదల, డ్యామ్‌లో 13 గేట్లును పోలీసులు అధీనంలోకి తీసుకోవడం తదితర అంశాలపైనా చర్చించనున్నారు. ఇప్పటికీ సాగర్‌, పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు పెరగకపోవడం, పట్టిసీమ నుంచి నీటి విడుదలను నిలిపివేయడం తదితర కారణాలతో రబీలో వరికి నీరివ్వలేమని అధికారులు ప్రకటించారు. అంతేగాక రెండో పంటగా డెల్టాలో జొన్న, మొక్కజొన్న సాగుకూ అనుమతివ్వలేమని కేవలం మినుము, పెసర మాత్రమే సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. ఈ అంశాలను ప్రజా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురానున్నారు. గృహనిర్మాణమూ మందకొడిగా సాగుతోంది. జగనన్న భూ హక్కు సర్వేపై పలు వివాదాలు ఏర్పడ్డాయి. రికార్డుల్లో పలువురి భూముల వివరాలు మారిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. జగనన్న భూ హక్కు పథకం ద్వారా 223 గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. 5.95 లక్షల ఎకరాల భూమి ఉంది. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్‌లో కలిపిన గ్రామాలతోపాటు, సిఆర్‌డిఎ పరిధిలోని 29 గ్రామాల్లో సర్వే జరగడం లేదు. మొత్తంగా 50 గ్రామాల్లో సర్వే పనులు మినహాయించారు. మిగతా 173 గ్రామాల్లో రీసర్వే పనులు మందకొడిగా జరుగుతున్నాయి. సమావేశంలో పాల్గొనాల్సిన వారిలో టిడిపి నుంచి నూతనంగా ఎన్నికయిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తుండగా ఎంపి గల్లా జయదేవ్‌ ఏడాదిగా జిల్లాకు రావడం లేదు.

➡️