రెండోరోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 21,2023 21:40

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు డిమాండ్‌ చేశారు. జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారం రెండోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఎంటిఎస్‌ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించి, వార్షిక బడ్జెట్‌ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలని, గ్రాడ్యుట, రూ.20లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ సమ్మె విరమించబోమని సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు స్పష్టం చేశారు.

➡️