రెండో రోజు కొనసాగిన ఎస్‌ఎస్‌ఎల సమ్మె

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: విద్యాశాఖ పరిధిలో గల సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న 18 విభాగాల కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్‌ సిబ్బంది సమ్మె రెండో రోజు గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా జెఎసి నాయకులు ఎ.పోలినాయుడు, కె.భారతి, బివి రమణ, బి.ఈశ్వరరావు, తదితరులు నిరసన శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సిఎం నేటికీ వారి ఉద్యోగ భద్రత, మినిమం టైం స్కేల్‌, గ్రాడ్యుటీ, పిఎఫ్‌ వంటి సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచినప్పటికీ సమగ్ర శిక్షలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచకపోవడం సమంజసం కాదని అన్నారు. సుప్రీంకోర్టు సూచన ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వ శిక్ష ఉద్యోగులకు వేతనాలు ఈనెల ఒకటో తేదీన చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగంలో విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న ఈ విభాగంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు. నిర్దిష్ట కాలం ప్రాతిపదికన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మెడికల్‌ లీవులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రెగ్యులర్‌ చేసే వరకు మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలన్నారు. ఈ డిమాండ్లపై ఇప్పటికే అనేక సార్లు ఆందోళన చేపట్టామని, అయినా ప్రభుత్వంలో స్పందన లేదని, ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ఉద్యోగుల గోడు తెలియజేయడానికి రాష్ట్రవ్యాప్త సమ్మెను చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు సిహెచ్‌ భానుప్రకాష్‌, ఎ.దివాకర్‌, జి.రమేష్‌, వై.గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️