రెక్కలు ముక్కలు చేసుకునే మాకు పథకాల రద్దా?

Feb 28,2024 23:58

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం తగదని భవన నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు అవ్వారు ప్రసాదరావు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని గాంధీ పార్కు వద్ద ధర్నా చౌక్‌లో రెండ్రోజుల రిలేదీక్షలను బుధవారం ప్రారంభించారు. దీక్షాపరులను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్‌ పూలమాలలేసి మాట్లాడారు. రాష్ట్రంలోని కార్మిక వర్గంలో సింహభాగం భవన నిర్మాణ కార్మికులని, 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు అమలవుతున్న సంక్షేమ పథకాలు నిలిపివేయడం దారుణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా వైసిపి వేయకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో గుర్తించాలని సూచించారు. సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి షేక్‌ సిలార్‌మసూద్‌ మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయాల్సిన పథకాలను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా అమలు చేయాలని, 1214 జీవో తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద మరణానికి రూ.6 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల బీమా, వివాహ, ప్రసవ కానుకలు, వృత్తి పరమైన పనిముట్లు తదితర సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోనూ అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డులో భవనిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ.2 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిందచిదన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.సురేష్‌, కోశాధికారి ఎ.ఆంజనేయులు, సహాయ కార్యదర్శి కె.ఆంజనేయులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.శ్రీను, రొంపిచర్ల మండలం కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరాజు, శివ, పఠాన్‌ మస్తాన్‌వలి, కార్మికులు పాల్గొన్నారు.

➡️