రేపు బాపట్లలో షర్మిల బహిరంగసభ

ప్రజాశక్తి-అద్దంకి: నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని, ముఖ్యంగా ఈ నెల 7వ తేదీన సాయంత్రం బాపట్లలో జరిగే కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల పాల్గొంటారని, కావున ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు అభిమానులకు మాజీమంత్రి జెడి శీలం పిలుపునిచ్చారు. పట్టణంలోని బంగ్లా రోడ్‌లోని ఆర్‌అండ్‌బి బంగ్లాలో నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి జేడి శీలం ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి షర్మిల అధ్యక్షులుగా రావడంతో పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. పిసిసి అధ్యక్షులు షర్మిలపై వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. షర్మిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర డిజిపిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినా గత తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏనాడైనా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అభివద్ధిపై, ప్రత్యేక హౌదాపై ప్రశ్నించిన దాఖలు ఏవైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆ పార్టీలు వారి వారి స్వార్థాల కోసం తప్ప రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని తెలిపారు. ఇప్పటికైనా వ్యక్తిగత దూషణలు మానుకోవాలని వైసిపి నాయకులకు హితవు పలికారు. ఈ నెల 7వ తేదీన బాపట్లలో జరిగే పార్టీ బహిరంగ సభను నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్‌ కోరే సురేంద్రనాథ్‌, ప్రకాశం, ఓ శ్రీనివాసరావు, కబలా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

➡️