రేషన్‌ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ సరుకులను సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఊసా వెంకటేశ్వర్లు తహశీల్దారు షేక్‌ నాగుల్‌ మీరాను కోరారు. సిఎస్‌ పురంలోని పాములవారి కాలనీ, ఎస్సీ కాలనీ ప్రజలకు దాదాపు మూడు నెలలుగా ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ ఇవ్వడం లేదు. దీంతో ఆయా కాలనీలలోని ప్రజలు రేషన్‌ షాపు వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు మంగళవారం తహశీల్దారు నాగుల్‌ మీరాను కలిశారు. సిఎస్‌ పురంలోని మూడో రేషన్‌ షాప్‌ పరిధిలోని రేషన్‌ లబ్ధిదారులకు వాహనం ద్వారా అందించే ఇంటింటికీ రేషన్‌ పంపిణీని దాదాపు మూడు నెలలుగా నిలిపివేయడానికి గల కారణం అడిగి తెలుసుకున్నారు. కారణం ఏదైనా ప్రభుత్వ పథకాలకు ప్రజలను దూరం చేయడం సరికాదని, వెంటనే ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డిసెంబర్‌ నెల నుంచి రేషన్‌ సరుకులను ఇంటింటికీ పంపిణీ చేస్తామని తహశీల్దారు నాగుల్‌ మీరా హామీ ఇచ్చారు.

➡️