రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

ప్రజాశక్తి -కొండపి : తుపాను కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు కోరారు. సిపిఎం బృందం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించి వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పటం తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. వారం రోజుల క్రితం వరకూ వర్షాలు లేక పంటలు సాగు చేయలేక, సాగు చేసిన పంటలు ఎండిపోతూ రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. మండలంలో 6 వేల ఎకరాల్లో పొగాకు సాగు చేయాల్సి ఉండ 4 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు తెలిపారు. శనగ 6,100 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా కేవలం 1100 ఎకరాల్లో సాగు చేసినట్లు తెలిపారు. మిర్చి 600 ఎకరాల్లో సాగు చేసినటుల తెలిపారు. వర్షం కారణంగా శనగ పంట ఎక్కువ శాతం దెబ్బతిన్నట్లు తెలిపారు. పొగ మొక్కలు ఉరకెత్తున్నట్లు తెలిపారు. 210 ఎకరాల్లో వరి నేలకొరినట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అధికారులకు అందజేసి రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు. శనగ రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీపై అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కెజి.మస్తాన్‌, మండల నాయకులు గడ్డం పిచ్చయ్య,బాలసుబ్రహ్మణ్యం, సామేలు, నాని పాల్గొన్నారు. తర్లుపాడు : వర్షం కారణంగా వరి, మిరప, ఇతర పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎపి రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోరారు. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నివేదికలు తయారు చేయాలన్నారు. ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలన్నారు. పంటలను పరిశీలించిన వారిలో రైతు సంఘం నాయకుడు ఏరువా పాపిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు గుమ్మా బాలనాగయ్య, దేవిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, బత్తుల అల్లూరయ్య, రావి వెంకటరెడ్డి, కె.అల్లురెడ్డి, కంది రమణారెడ్డి తదితరులు ఉన్నారు బల్లికురవ రూరల్‌ : తుపాను కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని సిపిఎం బందం కోరింది. మండల పరిధిలోని గుంటుపల్లి, బల్లికురవ ,గుంటుపల్లి ,నక్కబక్కలపాడు గ్రామాలలో వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను సిపిఎం బృందం గురువారం పరిశీలింది. ఈ సందర్భంగా సిపిఎం బృందం మాట్లాడుతూ మొక్కజొన్న. వరి, చెరుకు, ఇతర మెట్ట పంటలు వర్షం కారణంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. పంటలు దెబ్బతినడంతో కౌలు రైతులు నష్టపోయినట్లు తెలిపారు. కౌలు రైతులకు నష్టపరిహారం అందజేయాలన్నారు. పంటలను పరిశీలించిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి,తంగిరాల వెంకటేశ్వర్లు మండల నాయకులు గొల్లపూడి అంజయ్య ,బి. వీరయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

➡️