రైతులకు పరిహారం ఇవ్వాలని 14న అఖిలపక్షం ధర్నా

నరసరావుపేటలో మాట్లాడుతున్న ఎం.నాగేశ్వరరావు
ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : మిచౌంగ్‌ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 14న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. సోమవారం స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో సిపిఐ ఆధ్వర్యంలో ఆపార్టీ జిల్లా అధ్యక్షులు జంగాల అజరుకుమార్‌ అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌.మస్తాన్‌వలి, సిపిఎం జిల్లా నాయకులు కంచుమాటి అజరుకుమార్‌, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు కళ్లం రాజశేఖర్‌రెడ్డి, జనతాదళ్‌ నాయకులు సాంబశివరావు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి శివాజీ తదితరులు ప్రసంగించారు. తుపాను రైతులకు నష్టాన్ని మిగిల్చిందని, వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి, చేతికొచ్చిన పంట నీటమునిగి నష్టపోయారన్నారు. ప్రతి రైతునూ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నష్టపోయిన వారిలో కౌలు రైతులు అధికంగా ఉన్నారని, వారినీ ఆదుకోవాలని కోరారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం త్వరితగతిన నష్ట అంచనాలు పూర్తి చేసి, రైతులందర్నీ ఆదుకోవాలని కోరారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కోటా మాల్యాద్రి, పి.సత్యనారాయణ, ఎ.అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని సిపిఐ కార్యాలయంలో సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విజరుకుమార్‌ అధ్యక్షతన వహించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ కరువు పరిస్థితులతో అల్లాడుతున్న రైతులపై రోకటిపోటులా తుపాను విరుచుకుపడిందన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. తుఫాను బాధిత ఇతర రైతాంగ సమస్యలపై పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూ 14వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల వద్ద రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. పంటలు నష్టపోయిన రైతులకు వరి ఎకరాకు రూ.40 వేలు, మెట్ట పంటలకు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.60 వేల రూపాయలు, బిందు సేద్యం పంటలకు ఎకరాకు రూ.లక్ష కోరారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు మారుతి వరప్రసాద్‌, కె.రాంబాబు, కె.రామారావు, జి.శేఖర్‌, యు.రాము, టి.బాబురావు, అద్రూఫ్‌, ఎస్‌.ఎం బాషా, మస్తాన్‌వలి, జాన్‌ పాల్‌, వై.వెంకటేశ్వరరావు, సుభాని, కోట నాయక్‌, శ్రీను నాయక్‌, బి.శ్రీనివాస్‌, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️