రైతులకు మద్దతుగా సభ

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జె.జయంతి బాబు డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతుగా ఢిల్లీ నిర్వహించనున్న కిసాన్‌-మజ్దూర్‌ మహా పంచాయితీకి సంఘీభావంగా మండల పరిధిలోని అమ్మనబ్రోలు గ్రామంలో రైతు, కౌలు రైతు సంఘాల శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జయంతి బాబు మాట్లాడుతూ నల్లచట్టాలను రద్దు చేయాలని కోరుతూ 540 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏడాది పాటు చేపట్టిన ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులకు రాత పూర్వకంగా హామీలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ హామీలు ఇంత వరకూ అమలు చేయలేదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2021లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఢిల్లీకి బయలు దేరిన రైతులను హర్యాణ సరిహద్దుల్లో అడ్డుకున్నట్లు తెలిపారు. కందకాలు తవ్వించి రోడ్లపై మేకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బారీకేడ్లు, ముళ్ళకంచెలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రోన్లు ద్వార విషవాయువులు ప్రయోగించడం లాంటి చర్యలకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. విషవాయువు ప్రయోగం కారణంగా అనేక మంది రైతులు కంటి చూపు కోల్పోయినట్లు తెలిపారు. నాలుగు సార్లు చర్చలు జరిపి ఇచ్చిన హామీలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. రైతులకు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా రద్దు చేసిన నల్లచట్టాలను దొడ్డిదారిన అమలు చేసేందుకు పూనుకుంటుందన్నారు. వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీ లాంటి కార్పోరేట్‌ సంస్థలకు కట్టపెట్టెందుకు పూనుకుందన్నారు. ఎరువులపై సబ్సీడి కోత విధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌలు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కె. మాబు, జిల్లా సహాయ కార్యదర్శి టి. శ్రీకాంత్‌,సిఐటియు జిల్లా నాయకుడు కాలం సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.

➡️