రైల్వేను ప్రయివేటీకరణ చేయొద్దు

 ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌, బొబ్బిలి :  రైల్వే రంగాన్ని ప్రయివేటీకరణ చేయొద్దని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, పాసింజర్‌ రైళ్లు, జనరల్‌ బోగీలు పెంచాలని, రాయితీలను పునరుద్దరించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యాన గురువారం విజయనగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్ల వద్ద ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా సి ఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శంకర్రావు, కె.సురేష్‌ మాట్లాడుతూ దేశంలో అతి చౌకయిన ప్రయాణం, సరుకుల రవాణా చేస్తున్న భారత రైల్వేల ధ్వంసానికి, లక్షల కోట్ల రైల్వే ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి బిజెపి ప్రభుత్వం పూనుకుందని అన్నారు. 400 రైల్వే స్టేషన్లు, 90 ప్రయాణీకుల రైళ్ళు, 14 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాకు, రైల్వే స్టేడియంలు, రైల్వే కాలనీలు, గూడ్స్‌ షెడ్‌లు ఇలా మొత్తం విలువ రూ.1,62,496 కోట్లు నగదీకరణ కోసం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలిపారపు. .రైల్వే స్టేషన్ల చుట్టు పక్కల వున్న స్థలాలను ఆదానీ, అంబానీలకు నామమాత్రపు లీజుకు కట్టబెడుతోందన్నారు. లాభాలొచ్చే 150 రైల్వే రూట్లు కార్పొరేట్లకిచ్చి, లాభాలు రాని గ్రామీణ ప్రాంత రూట్లను మూసెయ్యడమే వారి లక్ష్యమన్నారు. ప్రయాణీకుల భద్రత, రైల్వే లైన్ల భద్రత, మెయింటెనెన్స్‌ ఇక గాలిలో దీపాలేనన్నారు. రైల్వేల ప్రైవేటీకరణ విధానాల వల్లే తరుచుగా రైలు ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రైలు ప్రమాదాలు రెట్టింపయ్యాయని అన్నారు. ఇటీవల ఒరిస్సాలోని బాలాసోర్‌ వద్ద మన రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదాలు సిగలింగ్‌ వ్యవస్థ,ట్రాక్‌ మెయింటెనెన్స్‌ నిర్వహణ సరిగా లేకపోవడం, సేఫ్టీ విభాగాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం, భద్రతా ప్రమాణాలు సరిగ్గాపాటించనందువల్లే జరిగాయని అన్నారు. ఈనేపథ్యంలో రైల్వేలను ప్రైవేటీకరణ బారి నుండి రక్షించుకోవటానికి, అన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, రైల్వేలోని ఉద్యోగ సంఘాలు, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ధర్నాల్లో విజయనగరంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి, నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్‌ మోహన్‌, బి.రమణ, నగర ఉపాధ్యక్షులు ఆర్‌.శంకర్‌రావు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, గోపి, రాఘవ, కాలసీ నాయకులు రమణ, బొబ్బిలిలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.గోపాలం, పెన్షనర్‌ సంఘం జిల్లా అధ్యక్షులు వి. శేషగిరి, టి.రమణ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు యుగంధర్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️