రైల్వే ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేను ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్‌ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, ప్యాసింజర్‌ రైళ్లు కొనసాగించాలని, రైల్వేలను పటిష్టం చేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి నిర్వీర్యం చేస్తోందన్నారు. అందులో భాగంగా రైల్వేరంగాన్ని ప్రయివేటుపరం చేసేందుకు పూనుకుందని విమర్శించారు. రైల్వే స్టేషన్లు, రైళ్లు, రైల్వే మార్గాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని విభాగాల్లోకి కార్పొరేట్‌ సంస్థలకు ద్వారాలు తెరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా రైల్వేరంగం మొత్తం కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లోకి పోతుందని విమర్శించారు. ఏడాదికి రూ.2.5 లక్షల కోట్ల ఆదాయం వస్తున్న పాడి గేదే వంటి రైల్వే రంగాన్ని పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రైల్వేలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులు భర్తీ చేయకుండా ప్రమాదాలకు ప్రభుత్వమే కారణమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేలో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సింది పోయి సమస్యలను పెంచి పోషిస్తుందని విమర్శించారు. భారత రైల్వే ఆదాయంలో 65 శాతం పైగా సరుకు రవాణా ద్వారానే వస్తుందని, సరుకు రవాణా కూడా ప్రయివేటుపరం చేసేందుకు మోడీ ఉత్సాహం చూపిస్తున్నారని విమర్శించారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర వర్గాలకు ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైల్వేలను రక్షించుకునేందుకు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో సిఐటియు నాయకులు బి.సోమయ్య, సిహెచ్‌.సుందరయ్య, వి.సాయిబాబు, టిపిఆర్‌.దొర, కోటేశ్వరరావు, శాస్త్రులు నాయకత్వం వహించారు.

➡️