రోడ్డు ప్రమాదాల్లో గంటకు 18 మంది మృతి

Feb 10,2024 00:22

సిబ్బందిని అభినందిస్తున్న ఆర్టీసీ అధికారులు
ప్రజాశక్తి – తెనాలి :
రహదారి భద్రత అవగాహన సదస్సు శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో నిర్వహించారు. ద్విచక్ర వాహన చోదకులు, ఆటో డ్రైవర్లు, లారీ ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులు, డ్రైవర్లకు నిర్వహించిన సదస్సులో జిల్లా ఉప రవాణా కమిషనర్‌ షేక్‌ కరీం ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా గతేడాది గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే, 1.50 లక్షల మంది మృతి చెందగా దాదాపు 4.80 లక్షల మంది గాయపడ్డారన్నారు. రాష్ట్రంలో 19 వేల యాక్సిడెంట్లు జరిగితే అందులో 9600 మంది మృతి చెందారని, 23 వేల మంది గాయపడ్డారని వివరించారు. జిల్లాలో మొత్తంగా 986 రోడ్డు ప్రమాదాల్లో 333 మంది మృతి చెందారని, 1200 మంది గాయపడ్డరని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ప్రజా జీవితంలో ఆందోళనకరంగా పరిణమించాయన్నారు. వాహనాలు నడిపేటప్పుడు అధిక స్పీడు, వాహనాలలో అధిక లోడు, మద్యం సేవించి వాహనాలు నడపటం ఇవన్నీ కూడా నిషేధమన్నారు. రవాణా శాఖ నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ ప్రమాదాలు అరికట్టేందుకు సహకరించాలని కోరారు. ఆర్టీవో కె.ప్రసాద్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో ప్రతి గంటకు 18 మంది మృతి చెందడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్ట్‌ ధరించాలని, హెవీ వాహనాలు నడిపేవారు కూడా రవాణా శాఖ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్‌ రాజశేఖర్‌, ఎంవిఐ రాఘవరావు, ఎఎంవిఐ మధుసూదనరావు, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – తెనాలిరూరల్‌ : నెల్లూరు జిల్లా ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.ఆదాం సాహెబ్‌, గుంటూరు డిపిటిఒ ఎం.రమాకాంత్‌ శుక్రువారం తెనాలి బస్‌ డిపోను సందర్శించారు. డిపోలో మెకానిక్‌ గ్యారేజి, డీజిల్‌ స్టేషన్లను పరిశీలించారు. ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. బస్సుడ్రైవర్లకు కండక్లర్లు తోడ్పాటు అందించాలన్నారు. గతనెలలో ఉత్తమ సేవలందించిన డ్రైవర్లను, పలువురు గ్యారేజి సిబ్బందిని సన్మానించారు. హెచ్‌ఎస్డి ఆయిల్‌ను పొదుపుగా వినియోగించిన డ్రైవర్లను అభినందించి సత్కరించారు. రానున్నరోజుల్లో తెనాలి డిపోను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ ఎ.రాజశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️