లక్ష్యం చేరని ఆయిల్‌పామ్‌

Feb 4,2024 20:31

  ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : దేశంలో ఆయిల్‌ పామ్‌ సాగుకు ఆంధ్రప్రదేశ్‌ పెట్టింది పేరు. అందులోనూ మన జిల్లాలో దీని సాగు పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాగుకు అనుగుణమైన సారవంతమైన మెట్ట భూములు మన రాష్ట్రంలో ఉండడమే ఇందుకు కారణం. ఈనేపథ్యంలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెంచేంచేందుకు, తద్వారా ఆయిల్‌ డిమాండ్‌ను తగ్గించుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మన రాష్ట్రానికి కాస్తంత ఎక్కువ లక్ష్యం విధించినప్పటికీ, ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకబడి ంది. ఆయిల్‌ పామ్‌ సాగుకు నిరంతరం నీరు అందుబాటులో ఉండాల్సివుంటుంది. లేదంటే భారీ నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అత్యధికంగా భూగర్భజలాలు ఉండడంతోపాటు బోర్లు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఆయిల్‌ పామ్‌ సాగవుతుంది. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో నాగావళి, వంశధార, చంపావతి, వేగావతి, సువర్ణముఖి, గోముఖి వంటి నదీపరివాహక ప్రాంతాల్లోనూ సాగు ఉంది. ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 60వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం విధించగా, స్థిరమైన నీటి లభ్యత లేని కారణంగా లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకబడింది. కేవలం 42వేల ఎకరాలు మాత్రమే సాగు విస్తీర్ణం పెరిగింది. ఇందులోనూ ఎక్కువగా భాగం కోనసీమ, ఏలూరు, పార్వతీపురం మన్యం తదితర జిల్లాల్లోనే కనిపిస్తోంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో తక్కువగా పెరిగింది. వాస్తవానికి ఆయిల్‌ పామ్‌ లాభసాటి వాణిజ్యపంట. చీడపీడ సమస్య అనేది ఉండనే ఉండదని ఉద్యాన వనశాఖ అధికారులు చెబుతున్నారు. సాగుకు అనుగుణమైన మెట్ట ప్రాంతంలో పుష్కలమైన నీటి వనరులు ఉంటే ఆదాయానికి కొదవలేనట్టే. దీనికితోడు మొక్కలు మొదలుకుని, సాగు, అంతర్‌పంటల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఇన్‌పుట్‌ సబ్సిడీ కల్పించాయి. ఒక 2.5ఎకరాల్లో స్వదేశీ మొక్కలు నాటితే 2,1000, విదేశీ మొక్కలకు 29వేలు చొప్పున ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీలే ఇన్‌పుట్‌ సబ్సిడీలు అందిస్తాయి. ఇలా ఒక్కో రైతూ 37.5 ఎకరాల వరకు సబ్సిడీ పొందేందుకు అవకాశం ఉంది. 4ఏళ్ల సాగు సమయంలో ప్రతి 2.5 ఎకరాలకు ఏటా రూ.5,250 చొప్పున, అంతరపంటలకు మరో రూ.5,250 చొప్పున రాయితీ పొందేందుకు అవకాశం ఉంది. అంతకు మించి సారవంతమైన మొట్ట భూములు కూడా రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్నాయి. కానీ, వాటికి నీటి వసతి మాత్రం లేదు. రాష్ట్రంలో జలసిరి బోర్లు పథకం ముందుకు సాగలేదు. గతంలో ఎపిఎంఐపి ద్వారా సబ్సిడీపై ఇచ్చే డ్రిప్‌ ఇరిగేషన్‌ యూనిట్లు మచ్చుకు కూడా మంజూరు కాని పరిస్థితి. వర్షపునీరు కూడా నదుల ద్వారా సముద్రంలోకి పోవడం తప్ప జంఝావతి, తోటపల్లి, వంశధార వంటి ప్రాజెక్టులు పూర్తిచేయలేదు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు గత ఏడాది వరకు 4,375 ఎకరాల్లో ఉంది. ఈ ఏడాది కేంద్రం ఇచ్చిన లక్ష్యం ప్రకారం 1,845 ఎకరాల మేర పెంచాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 855 ఎకరాలు మాత్రమే పెరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ నీటి వసతి లేకపోవడం వల్ల లక్ష్యం చేరుకోవడంలో వెనుకబాటు కనిపిస్తోంది. నీటి వసతి అందుబాటులోకి తెస్తే ఆయిల్‌ పామ్‌ రైతులకు రూ.కోట్ల ఆదాయం సమకూరుతుందని రైతాంగం చెబుతోంది.

సాగునీటి వసతి లేకే లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం

సాగునీటి వసతి లేకే ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. జిల్లాలో నీటి వసతి ఉన్న అన్నిచోట్ల ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నాం. కొన్ని నదుల్లో నీరు ఉన్నా అక్కడ ఆనకట్టలు, బోర్లు వంటివి లేవు. జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో బోర్లు కూడా తక్కువగానే ఉన్నాయి. బోర్లు ఉన్నచోట కూడా డ్రిప్‌ ఇరిగేషన్‌ సదుపాయం లేదు. ఆయిల్‌పామ్‌ సాగుకు నీరే అత్యంత కీలకం. కనీసం 2.5 అంగులాల బోరు నింతరం పారుతుండాలి.

ఎవిఎస్‌వి జమదాగ్నిజిల్లా ఉద్యాన శాఖ అధికారి

➡️