లోక్‌అదాలత్‌లో 1764కేసులు పరిష్కారం

Dec 9,2023 20:21

 ప్రజాశక్తి-విజయనగరం లీగల్‌  :  కుటుంబ కలహాలతో వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలను దూరం చేసుకోరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్‌ చక్రవర్తి అన్నారు. కుటుంబ సభ్యులు పట్టింపులకు పోయి కలహాలతో చక్కని జీవితాలను పాడుచేసుకుంటున్నారని, వీటిని మనమే సరిద్దికోవాలని అప్పుడే వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యలు పెరుగుతాయని అన్నారు. కక్షి దారులయొక్క హక్కులను కాపాడుతూ, కోర్టులలో వున్న వ్యాజ్యలను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోను జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, గజపతినగరం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం కోర్టుల్లో 1,764 కేసులను పరిష్కరించినట్లు ఈ సందర్భంగా జిల్లా జడ్జి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఇటీవల కాలంలో కుటుంబ తగాదాలు ఎక్కువగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాఉ. అనవసర కలహాలుమాని పిల్లల భవిష్యత్‌ కోసం, మన మీద ఆధార పడ్డవారి కోసం రాజీకి రావాలని హితవు పలికారు. కేసులకోసం పోలీస్‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1764 కేసులు ఈ సందర్భంగా పరిష్కారమయ్యాయి. విజయనగరంలో 1065, పార్వతీపురంలో 115, బొబ్బిలిలో 134, సాలూరులో 109, శంగవరపుకోటలో 47, గజపతినగరంలో 143, చీపురుపల్లిలో 117, కొత్తవలసలో 34 కేసులు పరిష్కరించారు. 89 మోటార్‌ ప్రమాదభీమా కేసులను పరిష్కరించారు. కక్షిదారులకు 1కోటి 85లక్షల 95వేల 281 మొత్తాన్ని అందజేయనున్నారు. అదాలత్‌లో జిల్లా న్యాయమూర్తులు జి.రజని, సికెందర్‌ బాషా, కె.నాగమణి, బిహెచ్‌వి లక్ష్మికుమారి, బి.రమ్య, కె. మోహిడెన్‌ జమూరుత్‌ బేగం, హరినాధ శర్మ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సిహెచ్‌ దామోదర రామ్మోహన రావు, తదితరులు పాల్గొన్నారు. కక్షిదారులకు సౌకర్యార్థం మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు అంజనీ కుమార్‌, పంపానా రవి కుమార్‌, పిఎఎన్‌ రాజు సహకారంతో కక్షి దారులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయమూర్తులు స్వయంగా కక్షిదారులకు వడ్డించారు. కార్యక్రమంలో విజయనగరం రూరల్‌ సిఐ టివి తిరుపతిరావు, వన్‌ టౌన్‌ సిఐ బి.వెంకటరావు, ఎస్‌ఐ లు గణేష్‌, భాస్కరరావు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️