వచ్చే ఏడాదికి ప్రతి ఇంటికీ నీటి కుళాయి

Jan 22,2024 00:52

ప్రజాశక్తి -పల్నాడు జిల్లా : ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను వచ్చే ఏడాదికి పూర్తి చేసి శివారు కాలనీలకు సైతం రక్షిత నీరు అందజేయడమే లక్ష్యంగా గ్రామస్థాయి నుండి ప్రణాళికలు రూపొందించామని గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య పర్యవేక్షిత ఇంజినీర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ సురేష్‌ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి నీటి కుళాయి ఏర్పాటు పనులు పూర్తి చేస్తామని, అందులో భాగంగానే సిబ్బందిని సన్నద్ధం చేశామని అన్నారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన శాఖా పరమైన అంశాలను వివరించారు.
జల్‌ జీవన్‌ మిషన్‌ లక్ష్యం ఏమిటి?
గ్రామ గ్రామాన శివారు కాలనీలకు సైతం ప్రజలకు రక్షిత నీరు అందించడమే జల్‌ జీవన్‌ మిషన్‌ లక్ష్యం. 2019లో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిధులతో ఈ పనులు చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాకు రూ.508.16 కోట్లతో 1055 పనులు మంజూరయ్యాయి.
పల్నాడు జిల్లాలో జరిగే పనులు?
జిల్లాలో 419740 గృహాలు ఉండగా ఈ పథకం ప్రారంభించే నాటికి 58166 గృహాలకు నీటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. పథకం ప్రారంభించాక 145260 ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చాం. 274480 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి 51742 లక్ష్యం నిర్దేశించగా 34692 కనెక్షన్లు మంజూరు చేశారు.
పనులను ఎప్పటికీ పూర్తి చేస్తారు?
పనుల్లో 624 పనులు పూర్తవగా మిగతావి కూడా వేగంగానే జరుగుతున్నాయి. ఈ ఏడాది 318 పనులు మంజూరవగా వీటికి రూ.13.56 కోట్లు కేటాయించారు. వీటిలో 197 పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది పనులన్నీ పూర్తి చేసి ప్రతి కుటుంబానికి నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
నీటి అవసరాలు తీర్చేందుకు ప్రధానంగా ఏమున్నాయి?
పల్నాడు జిల్లాలో 28 మండలాలకు ప్రధాన నీటి వనరు నాగార్జున సాగర్‌ జలాశయం. నీటిని సమ్మర్‌ స్టోరేజి ట్యాంకుల ద్వారా గ్రామపంచాయతీల్లో చెరువుల్లో నిల్వ చేసి శుద్ధి చేసిన అనంతరం సరఫరా చేస్తాం. కొన్ని ప్రాంతాల్లో బోర్ల ద్వారా నీటిని తోడి శుద్ధి చేసి సరఫరా చేస్తున్నాం.
నీటి పరీక్షలు చేయించుకోవాలంటే ?
నరసరావుపేట, పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల, క్రోసూరులో నీటి పరీక్షలు చేసే ల్యాబ్‌లు ఉన్నాయి. ప్రతినెలా ఒక్కో ల్యాబ్‌లో 300 వరకు శాంపిల్స్‌ సేకరించి పరీక్షించి వాటి వివరాలను వెబ్‌ ల్యాండ్‌లో నమోదు చేస్తాం. ప్రతి గ్రామపంచాయతీకి ఫీల్డ్‌ టెస్ట్‌ కిట్‌ అందజేశాం. వాటి ద్వారా నీటి పరీక్షలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఎన్ని మరుగుదొడ్లు నిర్మించారు?
స్వచ్ఛ్‌ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఇప్పటికీ 14285 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేశాం. మరుగుదొడ్డి, స్నానపు గది కలిపి నిర్మించుకుంటే రూ.15 వేలు, మరుగుదొడ్డి మాత్రమే నిర్మించుకున్న వారికి రూ.12 వేలు లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు జమ చేస్తాం.జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పనకు చర్యలు?పేదలందరికీ ఇళ్లు పథకం కింద శాశ్వత ప్రాతిపదికన నీటి సరఫరా చేసేందుకు కేటాయించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంటి నిర్మాణానికి అవసరమైన నీటిని తాత్కాలిక ప్రాతిపదికన సరఫరా చేస్తున్నాం.

➡️