వలస కూలీల ట్రాక్టర్‌ బోల్తా: 18 మందికి తీవ్ర గాయాలు

 

సత్తెనపల్లి రూరల్‌, క్రోసూరు : ట్రాక్టర్‌ బోల్తా పడి వలస కూలీలు గాయపడిన ఘటన క్రోసూరు మండలం 88 తాళ్లూరు సమీపంలో గురువారం జరిగింది. కర్నాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన 18 మంది వలస కూలీలు,వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూరలు జిల్లాతోపాటు రాయచూర్‌కు చెందిన కూలీలు మిర్చి కోతలకు సత్తెనపల్లి మండలం భట్లూరు వచ్చారు. అక్కడే ఉంటూ చుట్టు పక్కల గ్రామాల్లో మిర్చి కోతలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం క్రోసూరు మండలం గాదేవారిపాలెంలో మిర్చి కోతలకు రాయచూర్‌కు చెందిన కూలీలు ట్రాక్టర్లో వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నారు. ఈ మార్గంలో మలుపులు ఎక్కువగా ఉన్నాయి. తాళ్లూరు సమీపంలో మలుపు తిరిగే సందర్భంలో డ్రైవర్‌ బ్రేకు వేయ బోయి ఎక్సలేటర్‌ తొక్కడంతో ట్రాక్టర్‌ అదుపు తప్పి రోడ్డుపక్క నున్న నీరు లేని పంట కాల్వలో బోల్తా పడింది. ట్రాక్టర్‌లో ఉన్న 18 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (జిజిహెచ్‌)కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️