వాలంటీర్లకే ఓట్ల బాధ్యతలు!

Mar 31,2024 21:38

ప్రజాశక్తి – గురజాల : వాలంటీర్లపై ఆంక్షలున్నా వారిని ఏదోఒక రూపంలో ఉపయోగించుకుని ఎన్నిల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. పింఛన్లు పంపిణీ చేయొద్దని, వారికి ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు, ఇతర పరికరాలను ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నంత వరకూ స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు కొత్తగా ఫోన్లు, సిమ్‌ కార్డులు ఇవ్వాలని నాయకులు యోచిస్తున్నారు. ప్రభుత్వ ఫోన్లను స్వాధీనం చేయడానికి ముందుగానే అందులోని సమాచారాన్ని తామిచ్చే కొత్త ఫోన్లలోకి మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. సిమ్‌లను వాలంటీర్ల పేర్లతో కాకుండా ఇతరుల పేర్లతో తీసుకుంటే ఇబ్బందులు ఉండవనే ఆలోచనా చేస్తున్నట్లు తెలిసింది. పల్నాడు జిల్లాలో 4800 మంది వాలంటీర్లు ఉండగా వీరి ద్వారా ఎన్నికలోల లబ్ధిపొందాలని అధికార పార్టీ చూస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం వీరికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారని, నరసరావుపేట, పెదకూరపాడు నియోజకవర్గాల్లో వాలంటీర్లకు రూ.10-20 వేల వరకు ప్యాకేజీ అందిందని సమాచారం. ఓటర్లకు డబ్బు పంపిణీ పనినీ వాలంటీర్లకు అప్పగించాలని చూస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి.

➡️