వాహనాల బదిలీ సులభతరం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి ః ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలను కొనుగోలుచేసి రాష్ట్రంలో నడిపేందుకు వీలుగా బదిలీ విధానాన్ని ప్రభుత్వం సులభతరం చేసిందని జిల్లా రవాణా అధికారి షేక్‌ కరీం తెలిపారు. ప్రస్తుతం వాహనాల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదై ఉంటాయని, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తెచ్చుకోవాలంటే లైసెన్సు పొందిన రాష్ట్రం నుంచి నిరంభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌వోసి) ఇస్తారని, దీనిని ఆన్‌లైన్‌లో ఉంచుతారని, ఈ మేరకు వాహనం బదిలీ జరుగుతుందని తెలిపారు. దొంగ వాహనాల అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందన్న ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు తెలిపారు.వాహనాల బదిలీ ఎలా జరుగుతోంది?వేరే రాష్ట్రానికి చెందిన వాహనాన్ని కొనుగోలు చేస్తే అక్కడి రవాణా అధికారుల నుంచి ఎన్‌వోసి తప్పని సరిగా ఉండాలి. అన్ని ధ్రువపత్రాలు పరిశీలించిన తరువాతే వాహనం ఒకచోట నుంచి మరొక చోటుకు బదిలీ అవుతుంది. దొంగతనం చేసిన వాహనాలను విక్రయించకుండా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అన్ని వివరాలను నమోదు చేసిన తరువాతే ఈ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఏ రాష్ట్రంలో వాహనం తయారు చేశారు? ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేశారు? సంబంధిత అధికారుల వివరాలను ఆన్‌లైన్‌లో పరిశీలించిన తరువాతే ఆమోదిస్తారు. జాతీయ స్థాయిలో సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. వాహనం బదిలీకి సంబంధించిన ఫీజులను కూడా చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ లైసెన్సుల జారీలో వచ్చిన మార్పులు?డ్రైవింగ్‌ లైసెన్సులకు జాతీయ స్థాయిలో కొత్త పోర్టల్‌ను రూపొందించారు. గతంలో ఈ-ప్రగతి పోర్టల్‌ నుంచి ఇప్పుడు దేశం మొత్తం ఒకే విధానం అమలు చేస్తున్నారు. వాహనసారధి పోర్టల్‌ ద్వారా దేశం మొత్తం అనుసంధానం జరిగేలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఒక లైసెన్సుదారుడి వివరాలు దేశంలో ఎక్కడైనా పరిశీలించే అవకాశం ఉంది. కొత్త పోర్టల్‌లో ప్రస్తుతం రెన్యువల్స్‌ చేస్తున్నాం. త్వరలో లైసెన్సుల మేళా నిర్వహిస్తాం.ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు?ఆటోలు, క్యాబ్‌లు, టాటా మేజిక్‌లపై నిఘాపెట్టాం. పరిమితికి మించి విద్యార్థులను, ప్రయాణికులను ఎక్కిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆటోల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆటో వారికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై నిత్యం వేర్వేరు ప్రదేశాల్లో తనిఖీలు చేస్తుంటాం. ఈ తనిఖీల ద్వారా నెలకు రూ.కోటి 10 లక్షల వరకు ఫైన్ల రూపంలో ఆదాయం వస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నా, లైసెన్సు, వాహనాలకు ఫిట్‌ నెస్‌ సర్టిఫికెట్‌ లేకున్నా జరిమానాలు విధిస్తాం. వాహనదారులు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం సరికాదు. కార్లు నడిపే వారు సీటు బెల్టు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి. వాహనాల్లో పరిమితికి మించి అధికంగా ప్రయాణికులను ఎక్కించడం, అతివేగం తదితర కారణాలపై ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపైనా తనిఖీ చేసి జరిమానాలు విధిస్తున్నాం. రవాణశాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయ లక్ష్యం?జిల్లాలో 2023-24లో రూ.403 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ ఫీజు, త్రైమాసిక పన్నులు, రెన్యువల్స్‌, లైఫ్‌ టాక్సు తదితర అంశాల ద్వారా లక్ష్యం మేరకు ఆదాయం రాబట్టడానికి కృషి చేస్తున్నాం. ఈఏడాది ఇప్పటి వరకు రూ.268 కోట్ల వరకు ఆదాయం రాబట్టాం.

➡️