వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి

వికలాంగులకు

ప్రజాశక్తి-యంత్రాంగం వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని పలువురు డిమాండ్‌ చేశారు. ఆదివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్రపురం వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని వికలాంగుల జిల్లా నాయకులు పలివెల రాజు విజ్ఞప్తి చేశారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో తహశీల్దారు ఎం.వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే దానిని వికలాంగులకు ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ తాము రాష్ట్రంలో 25 లక్షలకు పైగా ఉన్నామని, రాజకీయ పార్టీలు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో సచివాలయ సిబ్బంది అవగాహన లేకుండా వికలాంగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి 2016 చట్టాన్ని అమలు చేసే విధంగా ఒక జిఒ జారీ చేయాలని కోరారు. అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని తీర్మనం చేసిందని తీర్మానం కాపీని తహశీల్దారుకు చూపించారు. రేషన్‌ కార్డులు ఉన్న ఉద్యోగస్తులను తక్షణమే ఆ కార్డు నుంచి తొలగించాలని, ఒంటరిగా ఉన్న వికలాంగులకు రేషన్‌ కార్డు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షుడు పలివెల రాజు, నాయకులు రాయుడు బుల్లయ్య, కష్ణారెడ్డి, శ్రీను, నాగేంద్ర, కాదా శ్రీను, మల్లికార్జునరావు, దిగిమర్తి శ్రీను, రమణ, గురుమూర్తి, పలివెల ఉమాదేవి, సత్య నాగరత్నం, వీరలక్ష్మి, మేరీ మంగ పాల్గొన్నారు. మామిడికుదురు మదర్‌ థెరిసా సంక్షమ సంఘం అధ్యక్షుడు జి.రమణ అద్యక్షతన సమావేశం నిర్వహించారు. బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని, సబ్సిడీ రుణాలు అందించాలని, భవన నిర్మాణానికి స్థలం కేటాయించాని కోరారు. వికలాంగుల పింఛను రూ.7 వేలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె.కోటేశ్వరరావు, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు. రావులపాలెం మండలం ఊబలంకలో డాక్టర్‌ నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి కేక్‌ కట్‌ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యుడు బాలు రెడ్డి పిల్లలకు పుస్తకాలు ఫ్రూట్స్‌ పంచిపెట్టారు. సంస్థ కన్వీనర్‌ నడింపల్లి సుబ్బరాజు వర్మ వివిధ ప్రాంతాల నుంచి దాతలు రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్‌ ప్రెసిడెంట్‌ కొవ్వూరి దుర్గా రెడ్డి, మల్లిడి రామిరెడ్డి, చింతా నాగిరెడ్డి, తమలంపూడి తాతారెడ్డి, షేక్‌ ఇస్మాయిల్‌, కొవ్వూరి సుధాకర్‌ రెడ్డి, నల్లమిల్లి సత్తిరెడ్డి పాల్గొన్నారు.

➡️