విజయగర్జన

Jan 27,2024 21:01 #విజయగర్జన

ఎట్టకేలకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సత్ఫలి తానిచ్చింది. సుమారు 42 రోజులపాటు 11 డిమాండ్లను నెరవే ర్చాలని కోరుతూ పట్టువిడవని సుదీర్ఘ పోరాటం స్పష్టమైన హామీలను రాబట్టుకుంది. సుమారు 10 డిమాండ్ల సాధనకు రోడ్‌మ్యాప్‌ కుదరడం స్వాగతించాల్సిన అంశం. ప్రభుత్వం సామ, ధాన బేధ, దండో పాయాలను ప్రయోగించినప్పటికీ స్పష్టత లభించే వరకూ పోరాటం సాగించడం ఉద్యమ చరిత్రలో ఉత్కంఠభరితమైన పేజీగా నిలిచిందని చెప్పవచ్చు. మంత్రుల దగ్గర నుంచి పోలీసులను, ఐసిడిఎస్‌, కలెక్టర్‌ వంటి ఉన్నతాదికారులను బెదిరింపులను సైతం లెక్క చేయకుండా సాగించిన పోరాటం అనుపమానమని చెప్పవచ్చు. ఎస్మా వంటి క్రూర చట్టాలను ప్రయోగించినప్పటికీ తెగువతో సాగించిన పోరాటం చరిత్రాత్మకమని చెప్పవచ్చు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా తలవంచకుండా నాయకత్వంపై ఉంచిన విశ్వాసంతో సాగించిన పోరు అనితర సాధ్యమని చెప్పవచ్చు. ఏదేమైనా కొన్నేళ్లుగా పెండింగ్‌ బారినపడిన సమస్యల పరిష్కారానికి స్పష్టత లభించడం ఉపశమనం లభించింది. ప్రభుత్వం సైతం తమ అమ్ములపొదిలోని అస్త్రశస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పదాతిదళాల తరహాలో పనిచేసే సంక్షేమ సైనికుల పట్ల ఇంతటి నిరంకుశంగా వ్యవహరించడం విస్మయాన్ని కలిగించింది. ప్రభుత్వం ఐదేళ్లుగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ ప్రయోగాన్ని పెద్దఎత్తున ఆచరణలోకి తీసుకెళ్తున్న అంగన్వాడీలు, ఆశాల పట్ల నిర్ధయగా వ్యవరించడం క్రూర పరిహాసమే. ప్రకృతి సహజ న్యాయసూత్రాల ప్రకారం కింది స్థాయి ఉద్యో గులకు అందించాల్సిన ప్రయోజనాల విషయంలో పాలకులు నిరంకుశంగా వ్యవహరించడం ఆందో ళనకరం. ఇంతటి సుదీర్ఘ పోరాటానికి నాయకత్వం వహించిన సిఐటియు తెగువ అనన్య సామాన్యమని చెప్పవచ్చు. సిఐటియు నాయకత్వం ఆధ్వర్యంలో సాగించిన సుదీర్ఘ పోరాటం గతేడాది యుటిఎఫ్‌ సాగించిన చలో విజయవాడను మరిపిచిందనే చెప్పాలి. భవిష్యత్‌ ఉద్యమాల నిర్వహణ, ప్రస్తావన సమయాల్లో తాజాగా జయప్రదంగా ముగిసిన అంగన్వాడీల ఉద్యమాన్ని స్మరించకుండా ఉండలేని పోరాటంగా నిలిచిపోనుందని చెప్పవచ్చు.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️