విద్యను ప్రోత్సహించడంలోనూ ఎస్‌ఎఫ్‌ఐ ముందంజ

Feb 20,2024 21:43

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పోరాటాల్లోనే కాదు విద్యను ప్రోత్సహించడంలోనూ ఎస్‌ఎఫ్‌ఐ ముందుంటుందని వక్తలు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన ఇటీవల పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞా వికాసం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదాన కార్యక్రమం మంగళవారం జెడ్‌పి మినిస్టీరియల్‌ హాలులో జరిగింది. ఒకటవ పట్టణ సిఐ వెంకట్రావు, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, జివికె జిల్లా కన్వీనర్‌ కె .శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాము, సిహెచ్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐ వెంకటరావు మాట్లాడుతూ విద్య నేర్చుకునేందుకు పాఠ్య పుస్తకాలే కాకుండా సమాజం కోసం ఉపయోగపడే పుస్తకాలను కూడా చదవాలని సూచించారు. ఇలాంటి పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థుల్లో పబ్లిక్‌ పరీక్షల ముందు ఉండే భయాన్ని తొలగించవచ్చని, మానసికంగా బలోపేతం కావడానికి బాగా ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్బంగా జిల్లాస్థాయి ప్రథమ స్థానం సాధించిన వై.కృష్ణవర్ధన్‌ (రవీంద్ర భారతి స్కూల్‌, ఎస్‌.కోట)కు మెమొంటో, రూ.5వేలు నగదు బహుమతి, రెండోస్థానంలో నిలిచిన ఎం.ఆశా దీపిక (నారాయణ ఒలింపియాడ్‌, విజయనగరం)కు మెమొంటోతో పాటు రూ.3వేలు నగదు బహుమతి, తృతీయ స్థానం సాధించిన పి.సౌభాగ్య (ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, నెలిమర్ల) కు మెమొంటో, రూ.2వేలు నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పి.రమేష్‌, ఎస్‌.సోమేష్‌, రాజు,వంశీ, డేవిడ్‌, మణి, సంధ్య పాల్గొన్నారు.

➡️