విద్యార్థులకు ప్రొఫెసర్‌ శాంతమ్మ ఆదర్శం

Feb 26,2024 20:52

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ప్రొఫెసర్‌ శాంతమ్మ అందరికీ ఆదర్శప్రాయురాలని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఇక్కడ జీలకర్రగూడేం లయన్స్‌ క్లబ్‌, తాడేపల్లిగూడేంలోని డైమాండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ కలసి సంయుక్తంగా ప్రొఫెసర్‌ శాంతమ్మను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ శాంతమ్మ వివిధ రంగాలలో అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. 96 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఆమె చురుకుగా పనిచేస్తొన్నారని కొనియాడారు. వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ప్రశాంత కుమార్‌ మహంతి మాట్లాడుతూ ఆమె ఇక్కడ సేవలు అందించడం తమ అదృష్టమన్నారు. లయన్స్‌ క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ ఆర్‌.ఆర్‌.రత్నకుమారి మాట్లాడుతూ డాటర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఫిజిక్స్‌ లో చేరిన మొట్టమొదటి మహిళగా బ్రిటీష్‌ రాయల్‌ సొసైటీ ఆమెకు గుర్తింపునిచ్చిందన్నారు. ఆమెను సత్కరించుకోవడం తమ అదృష్టంగా భావిస్తొన్నామన్నారు. మరో జోన్‌ చైర్మన్‌ పి.మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళకు సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పల్లవి మాట్లాడుతూ ఆమె సరస్వతి పుత్రికగా పేర్కొన్నారు. అనంతరం శాంతమ్మకు శాలువతో సత్కరించి మెమెంటోను బహూకరించారు. అనంతరం ఆమె పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ శాంతమ్మ మాట్లాడుతూ మరో నాలుగేళ్లలో సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో తాను శత జన్మదినోత్సవ వేడుకలు జరుపు కుంటానని స్పష్టం చేశారు. ప్రత్యేక అతిధులుగా లయన్‌ ఆర్‌.ఆర్‌. రంగరాజు, రేణుక, మురళీకృష్ణ, ఇందిర ప్రభ పాల్గొనగా కార్యక్రమంలో గ్రామ్‌ తరంగ్‌ ఎంప్లారు మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ సిఇఒ బాబు శంకర్‌, డీన్‌ ప్రొఫెసర్‌ ఎం.ఎల్‌.ఎన్‌. ఆచార్యులు, డీన్‌ డాక్టర్‌ సన్నీడియోల్‌తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

➡️