వైసిపికి రాజీనామాల సెగ!

Jan 24,2024 00:32

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసిపి ప్రజా ప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. రానున్న ఎన్నికల్లో వైసిపి తరుఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన వెంటనే అసమ్మతి భగ్గుమంది. తొలుత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి, వైసిపికి రాజీనామా చేశారు. ఆయన ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన వైసిపి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం పార్టీలో కలకలం రేపింది. నర్సరావుపేట లోక్‌సభకు బిసి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు శ్రీకృష్ణదేవరాయులును గుంటూరులో పోటీ చేయమన్నారని, అందుకు ఆయన అంగీకరించలేదని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ఱారెడ్డి చెప్పారు. పార్టీ నుంచి ఎవ్వరు వెళ్లినా నష్టం లేదని వ్యాఖ్యానించారు. అయితే గుంటూరు లోక్‌సభ పరిధిలో వైసిపికి సానుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల శ్రీకృష్ణదేవరాయులు విముఖత చూపారు. తాజాగా పల్నాడు జిల్లాలో కూడా వైసిపికి అననుకూలత ప్రారంభమైందని స్వీయ సర్వేలో వెల్లడి కావడంతో శ్రీకృష్ణదేవరాయులు ముందస్తుగా పార్టీ నుంచి వైదొలిగారని సమాచారం. ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో మంగళగిరి నియోజకవర్గంలో సమన్వయకర్తగా గంజి చిరంజివిని నియమించినా వైసిపిలో ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లు అధికార పార్టీ తయారైంది. జిల్లా ఇన్‌ఛార్జిగా ఉన్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఇక్కడి పరిస్థితులు చక్కదిద్దలేకపోవడం వల్ల ఇటీవల కాలంలో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి గంజి చిరంజివి కోసం క్షేత్రస్థాయిలో చిన్నపాటి నాయకుల ఇళ్లకు వెళ్లి మంతనాలు జరపాల్సి వచ్చింది. టిడిపి నుంచి మంగళగిరిలో నారా లోకేష్‌ పోటీ చేస్తుండటంతో వైసిపికి ఈ సీటు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ గంజి చిరంజీవికి సానుకూల పరిస్థితిని కల్పించడానికి వైసిపి నాయకులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళగిరిలో కాంగ్రెస్‌ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తే వైసిపి ఓటు బ్యాంకుకు భారీగా గండిపడే ప్రమాదం ఉండటంతో వైసిపిలో కలకలం బయలుదేరింది. బిసిలకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పుకుంటున్నా ఆ తరగుతుల్లోనే వ్యతిరేకత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గత కొన్ని రోజులుగా అసమ్మతి స్వరం విన్పిస్తున్నారు. ఆయన తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తేపార్టీలో కొనసాగాలని లేదంటే పార్టీ నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నారు. అయితే ఆయన టిడిపిలోకి వెళతారా? లేదా? అనేది బహిర్గతం కాలేదు. శ్రీకృష్ణదేవరాయులు బాటలోనే జంగా పయనిస్తారని వైసిపి వర్గాల్లో ప్రచారమవుతోంది. పొన్నూరులో ఎమ్మెల్యే రోశయ్య మార్చాలని ప్రయత్నించినా టిడిపికి దీటైన అభ్యర్థి దొరకలేదు. దీంతో అనివార్యంగా రోశయ్యను కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారమవుతోంది. పొన్నూరు నుంచి పోటీకి పలువురు సీనియర్లను ప్రతిపాదించినా వారు అంగీకరించ లేదు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా ప్రకటించిన ఎమ్మెల్యే ముస్తాఫా కుమార్తెకు కూడా అసమ్మతి సెగ తగిలింది. ఆమెకు వ్యతిరేకంగా డిప్యూటీ మేయర్‌ సజీల, ఆమె తండ్రి షౌకత్‌, ఇతర నాయకులు కలిసి భేటి అయ్యారు. తూర్పు నియోజకవర్గంలో వైసిపిలోని సీనియర్లు ఎంత వరకు సహకరిస్తారన్నదీ చర్చనీయాంశంగా మారింది. ప్రత్తిపాడులో సమన్వయకర్తగా నియమితులైనా బలసాని కిరణ్‌తో కూడా నాయకులు మమేకం కాలేకపోతున్నారు. ఆయన కూడా నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించలేదు. చిలకలూరిపేటలో మల్లెల రాజేష్‌ నాయుడుకు కూడా ప్రస్తుతం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ప్రత్తిపాడు, చిలకలూరిపేటలో అభ్యర్థుల ఎంపికపై వైసిపి ఐప్యాక్‌ ద్వారా రీ సర్వే చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్తిపాడులో మాజీ మంత్రి రావెలకిషోర్‌ను ఎంపిక చేస్తారని తెలిసింది. ఆయన రెండురోజుల్లో వైసిపిలో చేరతారని సమాచారం. టిడిపి బాగా పట్టున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి పుల్లారావును ఎదుర్కొంనేందుకు మల్లెల రాజేష్‌ సరితూగగలరా లేదా? అని ఐ ప్యాక్‌ మళ్లీ సర్వే చేస్తున్నట్టు తెలిసింది. గతంలో ఆయనకు పుల్లారావుతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కొంత మంది వైసిపి నాయకులు అంటీముట్టన్నట్టు వుంటున్నారు. గుంటూరు ఎంపిగా మరోసారి మోదుగుల వేణుగోపాలరెడ్డికి లేదా సినీనటుడు ఆలీకి అవకాశం ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. అంబటి రాయుడు అర్ధాంతర నిష్క్రమణతో వైసిపికి ఎంపి అభ్యర్థుల దొరకడం కష్టంగా మారింది. నర్సరావుపేట, గుంటూరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల వేటలో వైసిపి నాయకత్వం తలమునకలైంది.

➡️