సంపూర్ణ ఆరోగ్యం కోసమే క్రీడలు

ప్రజాశక్తి-రాయచోటి ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో క్రీడలను ఒక భాగంగా అలవర్చుకొని ఆరోగ్య వంతులుగా జీవించాలని ఉద్దేశ్యంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేపట్టారని కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ మైదానంలో ఆడుదాంఆంధ్ర క్రీడా పోటీలను కలెక్టర్‌, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహమ్మద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, వాలీబాల్‌ జాతీయ క్రీడాకారిణి, జిల్లా బ్రాండ్‌ అంబాసిడర్‌ వసుమతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించి, క్రీడా జ్యోతిని వెలించారు. గాలిలోకి బెలూన్లను వదిలారు. శాంతికి చిహ్నంగా కపోతాలను ఎగురవేశారు. అనంతరం పాల్గొన్న క్రీడాకారులుచే ఎమ్యేల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చాలావరకు చదువుకునేటప్పుడు మాత్రమే క్రీడలలో పాల్గొని ఆ తర్వాత వాటిని మరిచిపోతామని అన్నారు. నేడు అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దష్టి ఉంచి శారీరిక ధారుఢ్యం మెరుగు పరుచుకోవాలని ఆడదాం ఆంధ్ర కార్యక్రమాలను చేపట్టామన్నారు. రాష్ట్రంలో చాలావరకు ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని వారందరినీ వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మంది ఆడుదాం ఆంధ్ర లో రిజిస్ట్రేషన్‌ చేసుకు న్నారన్నారు. క్రీడా స్ఫూర్తితో జిల్లాకు ఎక్కువగా పథకాలు సాధించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెచ్చేందుకే ఆడుదాంఆంధ్ర కార్యక్రమానికి సిఎం జగన్‌ శ్రీకారం చుట్టారని అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ క్రీడా పోటీలను గ్రామ,వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐదు దశల్లో 2.99 లక్షల మ్యాచ్‌లు, ఈవెంట్లు నిర్వహించను న్నారన్నారని తెలిపారు.15 ఏళ్లు పైబడిన బాలబాలికలకు క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖోతో పాటు 3కే మారథాన్‌, యోగా, టెన్నికాయిట్‌ వంటి పోటీలను నిర్వహిస్తున్నారన్నారు. అలాగే గ్రామీణ ప్రాం తాల్లో సాంప్రదాయ క్రీడల్లోనూ పోటీలను పెడుతున్నారన్నారు. ఇందులో భాగంగా ఆయా సచివాలయాల పరిధిలో బాలబాలికలకు విడివిడిగా స్పోర్ట్స్‌ కిట్లను అందిస్తున్నారన్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో పోటీలకు నియో జకవర్గ స్థాయిలో తొలి స్థానంలో నిలిస్తే రూ.35 వేలు, జిల్లాస్థాయిలో రూ.60 వేలు, రాష్ట్రస్థాయి రూ.5 లక్షలు నగదు బహుమతి ఉందని తెలిపారు. కలెక్టర్‌ గిరీష పర్యవేక్షణలో పూర్తవుతున్న క్రికెట్‌ స్టేడియంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్బహించుకునేలా అభివద్ధి చేస్తామని ఎమ్యేల్యే శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ రంగస్వామి ,నియోజకవర్గ ప్రత్యేక అధికారి రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌, డిఇఒ శ్రీరామ్‌ పురుషోత్తం, జిల్లా స్పోర్ట్స్‌ అధికారి చంద్రశేఖర్‌, స్పోర్ట్స్‌ ప్రధాన కోచ్‌ గౌస్‌బాషా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వండాడి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు ఫయాజ్‌ అహమ్మద్‌, మదనమోహన్‌రెడ్డి, కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, జాకీర్‌, గౌస్‌ఖాన్‌, రౌనక్‌, సుగవాసి ఈశ్వర్‌ ప్రసాద్‌, సుగవాసి శ్యామ్‌, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️