సన్మార్గంలో నడిపించేది నాటకం

Jan 30,2024 00:30

డిమాన్క్రసి నాటికలో సన్నివేశం
ప్రజాశక్తి-గుంటూరు : సమాజాన్ని సన్మార్గంలో నడిపించేంది నాటకం అని గుంటూరు కళాపరిషత్‌ గౌరవ సలహాదారులు ఆలోకం పెద్దబ్బయ్య అన్నారు. మూడ్రోజులుగా స్థానిక వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో నిర్వహించిన 26వ వార్షిక నాటకోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలోకం పెద్దబ్బయ్య అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా వికాస్‌ విద్యా సంస్థల డైరెక్టర్‌ శంకరరావు మాట్లాడుతూ కళాపరిషత్‌కు వికాస్‌కు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నారు. రంగస్థల నటులు, దర్శకులు ఎన్‌.రవీంద్రరెడ్డి మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ గత 26 ఏళ్లుగా కళాపరిషత్‌ ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కళాపరిషత్‌ ప్రధాన కార్యదర్శి బి.పూర్ణ మాట్లాడుతూ దాతల సహకారం మరువలేనిదని అన్నారు. సభలో కార్యవర్గ సభ్యులు పి.శివరామకృష్ణ పాల్గొన్నారు. భార్యను సంతోషపెడితే జీవితం ఇంధ్ర ధనస్సులా సప్తవర్ణాలతో ఉత్సవంగా ఉంటుందని తెలిజెప్పే విధంగా విజయవాడకు చెందిన యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌ వారు ‘రంగు పడుద్ది’ నాటిక ప్రదర్శించారు. ఈ నాటికను మాఢభూషి దివాకరబాబు రచించగా, ఆర్‌.వాసు దర్శకత్వం వహించారు. రెండో నాటికగా విజయవాడ న్యూస్టార్‌ మోడ్రన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ వారు ‘డిమాన్క్రసి’ నాటిక ప్రదర్శించారు. పచ్చి నిజం చేదుగా ఉన్నా రోగాన్ని నయం చేసే శక్తి దానికి ఉంటుందని, తియ్యటి అబద్దం రుచిగా ఉన్నా తీవ్ర నష్టం చేస్తుందని నాటిక హెచ్చరించింది. చివరగా అమ్మ విలువను తెలియజేస్తూ ‘కౌశల్య సుప్రజా రామా’ నాటికను ప్రదర్శించారు. ఈ నాటికకు ఆకెళ్ల శివప్రసాద్‌ మూలకథ సమకూర్చగా, స్నిగ్థ నాటకీకరణ చేశారు. గోపరాజు విజరు దర్శకత్వం వహించారు.

➡️