సమరోత్సాహం

Jan 27,2024 22:03

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : 75ఏళ్లు వయసు మళ్లిన చంద్రబాబు మాదిరిగా నేను పొత్తుల కోసం దత్తపుత్రుడు, ఇతరుల వెంట వెంపర్లాడను. ప్రజలే నా దైర్ఘ్యం.. సంక్షేమం, అభివృద్ధి పథకాలే నా విధానం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. భీమిలిలో సంగివలస వద్ద శనివారం వైసిపి ఏర్పాటు చేసిన ‘సిద్ధం’ బహిరంగ సభకు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విజయనగరం జిల్లా నుంచి వందలాది వాహనాలు, బస్సుల్లో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సభలో కేడర్‌కు జగన్‌ 2024 ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తూ విపక్షాలపై విరుచుకుపడుతూ పార్టీ కేడర్‌లో ఎన్నికల సమరోత్సాహాన్ని నింపారు. వేల సంఖ్యలో పార్టీ కేడర్‌ తరలిరావడంతో భీమిలిలో ఇవాళ తనకు అటు సముద్రం, ఇటు జనసముద్రం కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో సేనాధిపతి కనిపిస్తున్నారని, ఇటు పక్క పాండవ సైన్యం ఉంటే అటుపక్క కౌరవ సైన్యం ఉందని ఈ యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ ఓడిపోక తప్పదంటూ వ్యాఖ్యానించారు. పద్మవ్యూహంలో చిక్కుకోడానికి తాను అభిమన్యుడ్ని కాదని అర్జునుడినని చెప్పారు. ఈ అర్జునుడికి శ్రీకృష్ణుడిలా ప్రజలు తోడున్నారన్నారు. 2024 ఎన్నికల్లో వైసిపికి 175కి 175 అసెంబ్లీ సీట్లు రావడం ఖాయమన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీచేసే దైర్ఘ్యం ఏనాడూ లేదని, ఈ సారి తన దత్తపుత్రుడ్ని తోడుతెచ్చుకున్నారని, 2019 ఎన్నికల్లో వచ్చిన 23 సీట్లు కూడా వారికి రావని అన్నారు. చంద్రబాబు చెప్పుకోడానికి ఏమీలేదని, తాను చెప్పడానికి 4ఏళ్లలో రూ.లక్షల కోట్లు ప్రజలకు బటన్‌ నొక్కి అకౌంట్లలో సంక్షేమం అందించామన్నారు. 2019 వరకూ ప్రజల అకౌంట్లలో ఏమీ పడలేదని, తాను అధికారంలోకి వచ్చాక ఈ పెద్ద మార్పు జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక లాభ, నష్టాల లెక్కను చూడకుండా సంక్షేమం ఇచ్చానన్నారు. పాలనలో జగన్‌ మార్క్‌ ఉందని, బాబు పాలన చెప్పుకోడానికి ఏమీలేదని అన్నారు. అప్పట్లో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 650 హామీల్లో 10శాతం కూడా అమలుచేయకుండా అన్నిటినీ అటకెక్కించేశాడని విమర్శించారు. హామీలు అటకెక్కించిన బాబు ఇంకా బతికే ఉన్నాడని ప్రజలకు వివరించాల్సిందిగా కేడర్‌కు జగన్‌ దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌సిపి జగన్‌ది కాదని కేడర్‌దని వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. వాలంటీర్లు మనలోంచి వచ్చిన మనవాళ్లేనని బయటవారు కాదని అన్నారు. 2019 నుంచి 99శాతం హామీలను అమలు చేశామన్నారు. వచ్చే 70 రోజులూ నిత్యం యుద్ధమే..వచ్చే 70 రోజులూ నిత్యం యుద్ధమేనని, మీరంతా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రతిపక్షాలపై యుద్ధ బాణాలుగా మారాలి’ అని ఎన్నికల నగారా మోగించారు. టిడిపి, జనసేన కలసి ప్రభుత్వంపై తప్పుడు ప్రచార ఆయుధాలతో దాడికి వస్తున్నారని, ఒంటరిగా ఎదుర్కొనడానికి తాను సిద్ధమని, మీరూ సిద్ధమేనా.. అలా అయితే దిక్కులు పిక్కటిల్లేలాగ సమరనాదం చేయండి అంటూ జగన్‌ అన్నారు. ప్రతి ఇంటికీ, ప్రతి గ్రామానికీ తన పాలనలో సంక్షేమం అందిందని, 60 శాతం ప్రజలు తమతోనే ఉన్నారని, ప్రతి ఇంటి నుంచీ ఒక స్టార్‌ క్యాంపెయినర్‌ వైసిపి కోసం వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఎన్నికలకు నేను సిద్ధం..మీరు సిద్ధమా అంటూ పదేపదే హాజరైన వారితో చప్పట్లు కొట్టించారు. ఉత్తకుండకు అరుపులెక్కువ.. చేతగానివాళ్లకు మాటలెక్కువ అనేలా ప్రతిపక్షాలున్నాయన్నారు. రాగల ఎన్నికలు పేదరికం నుంచి ప్రజలను బయటకు తెచ్చేవని, చదువుకునే పిల్లల తలరాతలు మార్చేవని అన్నారు. వేదికపై రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, విడదల రజని, గుడివాడ అమర్‌నాధ్‌, బూడి ముత్యాలనాయుడు, సీదిరి అప్పలరాజు, వైసిపి ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డి, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఉత్తరాంధ్రకు చెందిన అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ముఖ్యమైన ప్రజాప్రతినిధులు ఉన్నారు.

➡️