సమస్యలపై అంగన్‌వాడీల సమరం

సమస్యలపై అంగన్‌వాడీల సమరం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంతమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్లు మంగళవారం నుంచి ప్రారంభించిన నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా చేపట్టారు. జిల్లావ్యాప్తంగా వర్కర్లు హెల్పర్లు బొమ్మూరులోని కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. కార్యాలయం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు వైఎస్‌.జగన్‌ తెలంగాణ కంటే రూ.వెయ్యి అదనంగా ఇస్తానన్న వాగ్దానం అమలు చేయాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అందించాలని, పేస్‌ యాప్‌ రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినందించారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో చిరుద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే చిరుద్యోగులకు జగన్‌ ప్రభుత్వం చేసింది ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో స్కీమ్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సుందర బాబు, బి.రాజులోవ, అంగన్‌వాడీ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు ఎస్‌ఎస్‌.మూర్తి మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరుతో రాష్ట్రంలో అంగన్‌ వాడీ సెంటర్లను కుదిస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లుగా అనేకమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి సమస్యలు విన్నవించుకున్నా ఫలితం లేదని ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకునేందుకు అంగన్వాడీలు సిద్ధమయ్యారని చెప్పారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాణిక్యాంబ, కె.బేబీరాణి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ ధర్నాకు ఎపి ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.అన్నామణి, ఎం.వెంకటలక్ష్మి, ఐద్వా జిల్లా అధ్యక్షులు జరీనా షరీఫ్‌, టి.సావిత్రి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.బేబీరాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, జిల్లా కార్యవర్గ సభ్యులు అన్నపూర్ణ, బి.మార్త, సునీత, శారదా, రామలక్ష్మి, సుబ్బలక్ష్మి, దుర్గాంబ, తదితరులు పాల్గొన్నారు.పెరవలి మండలానికి చెందిన అంగన్వాడీలు, ఆయాలు జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాకు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. దుర్గ, రామలక్ష్మి, శ్రీదుర్గ, కన్యాకుమారి, విజయ, పుణ్యవతి, జ్యోతి, నాగలక్ష్మి, రాణి, కృష్ణవేణి, విశాలి, సత్తార్‌ పాల్గొన్నారు. ఉండ్రాజవరం కలెక్టరేట్‌ వద్ద నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మండలానికి చెందిన 124 మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు మంగళవారం తరలి వెళ్లారు. దీంతో మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు తాత్కాలికంగా మూతపడ్డాయి.

➡️