సమస్యలపై మున్సిపల్‌ కార్మికుల సమ్మె

మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ప్రజాశక్తి – పెద్దాపురంతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం పెద్దాపురం మున్సిపల్‌ వర్కర్స్‌ సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ కార్యదర్శి శివకోటి అప్పారావు మాట్లాడుతూ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌కు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమానమేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ కాంట్రాక్టు (ఆప్కాస్‌) కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, వారిని పర్మినెంట్‌ చేయాలని, పండగ సెలవులు, వారాంతరపు సెలవులు అమలు చేయాలని, ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్కు, హెల్త్‌ అలవెన్స్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి రాక ముందు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. కరోనా సమయంలో మున్సిపల్‌ వర్కర్ల కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రికి వారికి కనీస వేతనాలు ఇవ్వాలని గుర్తు లేదా అని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పిన ప్రభుత్వం అమలు చేయకుండా మున్సిపల్‌ కార్మికులను మోసం చేసిందన్నారు. తమ సమస్యల పరిష్కారమయ్యేంతవరకు సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరపరపు శ్రీనివాస్‌, యూనియన్‌ నాయకులు వర్రే గిరిబాబు, శేఖర్‌, చేపల శ్రీను, సింగంపల్లి సింహాచలం, సురేష్‌, రాజేష్‌, గంటా రమణ, బాసిన భద్రరావు, గంగా భవాని, నీలం నూకరత్నం, వర్రే వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️