‘సమ్మె’ల సమరం..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వంపై సమ్మెల సమరానికి దిగారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతోపాటు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టారు. కలెక్టరేట్‌ ప్రాంగణాలు ఉద్యోగులు, కార్మికుల నినాదాలతో మార్మోగుతున్నాయి. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలని, ఫేస్‌ యాప్‌లను రద్దు చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, పింఛన్‌తో కూడిన ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలంటూ అంగన్‌వాడీలు సమ్మెబాట పట్టారు. 15 రోజులుగా ఉధృతంగా సమ్మె సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెండు జిల్లాల్లో దాదాపు ఏడు వేల మందికిపైగా అంగన్‌వాడీలు సమ్మెలో ఉన్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు సరిగా పని చేయడం లేదు. బలవంతంగా సచివాలయ ఉద్యోగులతో తెరిపించినా ఎటువంటి ప్రయోజనమూ లేకుండాపోయింది. 2019 ఎన్నికల్లో తెలంగాణ కంటే రూ.వెయ్యి అదనంగా అంగన్వాడీలకు వేతనం ఇస్తామంటూ జగన్‌ హామీ ఇచ్చారు. అది అమలుకు నోచుకోలేదు. తెలంగాణలో రూ.13 వేలకుపైగా అంగన్వాడీల వేతనం ఉండగా, ఇక్కడ రూ.11,500 మాత్రమే ఉంది. తాను ఇచ్చిన హామీని కూడా సిఎం మరిచిపోయారంటూ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మెబాట పట్టి తమ హక్కులపై సమరం చేస్తున్నారు. అంగన్‌వాడీల బాటలోనే సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెకు దిగారు. గడిచిన ఏడు రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు వివిధ రూపాల్లో కలెక్టరేట్ల వద్ద సమ్మెలో భాగంగా నిరసనలు చేస్తున్నారు. సిఎం జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని వాగ్దానం ఇచ్చి మరిచిపోయారు. సమగ్ర శిక్షలో పని చేస్తున్న అన్నిరకాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని, ఉద్యోగులకు పిఆర్‌సి అమలు చేయకుండా, నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని, సమగ్రశిక్ష ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఏడు రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులంతా సమ్మెబాట పట్టడంతో విద్యాశాఖపై తీవ్ర ప్రభావం పడింది.సమ్మెకు దిగిన మున్సిపల్‌ కార్మికులు కరోనాలో అంతా ఇళ్లకు పరిమితమైనప్పుడు కూడా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించిన మున్సిపల్‌ కార్మికులు గురించి ఎంత చెప్పినా తక్కువే. మున్సిపల్‌ కార్మికులకు నెలకు రూ.లక్ష జీతం ఇచ్చినా తక్కువే అని సిఎం జగన్‌ అప్పట్లో మాట్లాడారు. ఎన్నికల ముందు మున్సిపల్‌ కార్మికులకు వైసిపి అనేక హామీలు గుప్పించింది. నాలుగున్నరేళ్లుదాటినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మున్సిపల్‌ కార్మికులను ఆరు నెలల్లో పర్మినెంట్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌ కల్పిస్తామంటూ ఇచ్చిన ఏఒక్క హామీ అమలు చేయలేదు. సమస్యలపై ఎన్నోసార్లు చర్చలు జరిపినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మున్సిపల్‌ కార్మికులు మంగళవారం నుంచి సమ్మెబాట పట్టారు. మున్సిపల్‌ కార్మికులు సమ్మెకు దిగడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. మున్సిపల్‌ కార్మికులు ఏరోజుకారోజు చెత్త తరలించకపోతే ముఖ్యంగా పట్టణాలు మురికికూపంగా మారిపోనున్నాయి. రెండు జిల్లాల్లో దాదాపు ఐదు వేల మందికిపైగా మున్సిపల్‌ కార్మికులు సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి. విఆర్‌ఒలు సైతం ఈ నెల 28న ఆందోళనకు పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్లలో రూపాయి జీతం పెంచకపోగా, డిఎ వెనక్కి తీసుకోవడం వంటి అనేక సమస్యలపై ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే విఆర్‌ఒలు సైతం సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు తమహక్కుల సాధనకై ప్రభుత్వంపై సమరానికి దిగడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

➡️